RIL: ఒక స్టాక్ కొంటే మరొకటి ఉచితం.. ఆమోదించిన రిలయన్స్ బోర్డు
దీంతో పాటు బోర్డు సమావేశంలో కంపెనీ అధీకృత మూలధనాన్ని రూ. 15,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లకు పెంచాలని సిఫార్సు చేసింది
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గురువారం బోనస్ షేర్ల జారీ చేయడానికి సంస్థ బోర్డు ఆమోదించింది. దీంతో ఒక రిలయన్స్ షేర్ కలిగిన వాటాదారులకు మరొక షేర్ ఉచితంగా లభిస్తుంది. ఇటీవల ఏజీఎం సందర్భంగా ఇన్వెస్టర్లకు 1:1 నిష్పత్తిలో షేర్లను ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో పాటు బోర్డు సమావేశంలో కంపెనీ అధీకృత మూలధనాన్ని రూ. 15,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లకు పెంచాలని సిఫార్సు చేసింది. బోనస్ షేర్ల జారీ విషయంలో ఎప్పుడు కేటాయించనున్నది స్పష్టత ఇవ్వలేదు. ఈ నిర్ణయంతో రిలయన్స్ సంస్థ 2017 తర్వాత మొదటిసారి బోనస్ షేర్‌ను ఇష్యూ చేసింది. ఆ సమయంలో రిలయన్స్ షేర్ ధర రూ. 700గా ఉంది. అప్పటి నుంచి స్టాక్ ధర నాలుగు రెట్లు పెరిగింది. లిస్టింగ్ తర్వాత ఇది రిలయన్స్ సంస్థ ఆరవ బోనస్ ఇష్యూ అవుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 16 శాతం పెరిగిన రిలయన్స్ షేర్ గురువారం 1.4 శాతం నష్టంతో రూ.2,985.95 వద్ద ముగిసింది. బోనస్ షేర్ ప్రకటన తర్వాత గత వారం నుంచి దీని షేర్లు పెరిగాయి.