ఆర్‌బీఐ గవర్నర్‌కు అరుదైన పురస్కారం!
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌కు అరుదైన ఘనత దక్కింది.
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌కు అరుదైన ఘనత దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ దాస్‌కు 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డును ప్రధానం చేస్తున్నట్టు ప్రకటించింది. 2023 ఏడాదికి గానూ ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. కరోనా మహమ్మారి లాంటి సంక్షోభ సమయంలో ఆర్‌బీఐ గవర్నర్ అందించిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం ఇచ్చామని సెంట్రల్ బ్యాంకింగ్ వెల్లడించింది.
బ్యాంకింగేతర సంస్థ దెబ్బతినడం, కరోనా మహమ్మారి రెండు వేవ్‌లను ఎదుర్కోవడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణం ఇలా అనేక సవాళ్లను అధిగమించడంలో దాస్ అత్యంత సమర్థవంతంగా పని చేశారు. కొత్త చెల్లింపుల వ్యవస్థతో పాటు అనేక సంస్కరణల ద్వారా దేశీయంగా కీలక మార్పులు వచ్చేందుకు దోహదపడ్డారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో భారత వృద్ధి కి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం అత్యుత్తమంగా ఉందని సెంట్రల్ బ్యాంకింగ్ అభిప్రాయపడింది. కాగా, గతంలో ఈ పురస్కారాన్ని 2015లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అందుకున్నారు.