ఏఐ అప్‌గ్రేడ్ కోసం మెకిన్సె, యాక్సెంచర్ ఇండియాలకు ఆర్‌బీఐ కాంట్రాక్ట్!

భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తన పర్యవేక్షక విధులను మరింత అభివృద్ధి చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్‌ వినియోగానికి గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థలైన మెకిన్సే అండ్ కంపెనీ ఇండియా ఎల్ఎల్‌పీ, యాక్సెంచర్ సొల్యూషన్స్ ఇండియాలను ఎంపిక చేసింది.

Update: 2023-08-13 13:12 GMT

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తన పర్యవేక్షక విధులను మరింత అభివృద్ధి చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్‌ వినియోగానికి గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థలైన మెకిన్సే అండ్ కంపెనీ ఇండియా ఎల్ఎల్‌పీ, యాక్సెంచర్ సొల్యూషన్స్ ఇండియాలను ఎంపిక చేసింది. ఆర్‌బీఐ తన భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై నియంత్రణా పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు అధునాతన విశ్లేషణ, ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లను విస్తృతంగా ఉపయోగించాలని చూస్తోంది. అందుకోసమే బయటనుంచి నైపుణ్యం కలిగిన సంస్థలను ఉపయోగించాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

పర్యవేక్షణకు సంబంధించి ఇన్‌పుట్ ప్రక్రియను రూపొందించడానికి గతేడాది సెప్టెంబర్‌లోనే ఆర్‌బీఐ ఆయా కన్సల్టెంట్‌ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)లను ఆహ్వానించింది. అందులో సమగ్రమైన పరిశీలన అనంతరం ఆర్‌బీఐ ఏడు దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసింది. వాటిలోంచి మెకిన్సే కంపెనీ ఇండియా ఎల్ఎల్‌పీ, యాక్సెంచర్ సొల్యూషన్స్ ఇండియాలకు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆర్‌బీఐ ఇప్పటికే ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లను ఉపయోగిస్తోంది. దానికి మరింత అప్‌గ్రేడ్ అవసరమని భావించి ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మెకిన్సె, యాక్సెంచర్ సంస్థలతో జరిగిన ఒప్పందం విలువ రూ. 91 కోట్లు అని సమాచారం.


Similar News