పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ
నిబంధనలు పాటించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలను నిలిపేయాలని బుధవారం సంస్థను ఆదేశించింది. నిబంధనలు పాటించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 'నిర్దేశించిన తేదీ తర్వాత నుంచి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్, వ్యాలెట్, ఫాస్ట్‌ట్యాగ్ మొదలైన వాటిలో ఏవైనా డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్‌లు అనుమతించబడవని ఆర్‌బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆయా సాధనాల్లో క్రెడిట్ అయ్యే వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర రీఫండ్లకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్, ఫాస్ట్‌ట్యాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వంటి వాటితో సహా బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాలెన్స్ నుంచి విత్‌డ్రా లేదా వినియోగించుకోవడానికి ఎలాంటి పరిమితులు ఉండవని, ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ వరకు అనుమతి ఉంటుందని ఆర్‌బీఐ తన ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఫండ్ బదిలీలు(ఐఎంపీఎస్ మొదలైనవి), యూపీఐ వంటి ఇతర బ్యాంకింగ్ సేవలను ఫిబ్రవరి 29 తర్వాత అందించకూడదని పేర్కొంది.