ఈసారి కూడా వడ్డీ రేట్లలో మార్పు ఉండదు!: నిపుణులు

భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ నెలలో జరిగే పాలసీ సమావేశంలో మరోసారి కీలక రెపో రేటును ప్రస్తుతం ఉన్న 6.5 శాతం వద్దే స్థిరంగా కొనసాగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Update: 2023-06-04 10:43 GMT

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ నెలలో జరిగే పాలసీ సమావేశంలో మరోసారి కీలక రెపో రేటును ప్రస్తుతం ఉన్న 6.5 శాతం వద్దే స్థిరంగా కొనసాగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రితం ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న యథాతథ నిర్ణయం, ఏప్రిల్ నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం వంటి పరిణామాలే దీనికి కారణంగా ఉంటుందని తెలిపారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ సమావేశంలో జూన్ 6-8 తేదీల మధ్య జరగనుంది. 8న సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు. ఏప్రిల్‌లో రిటైల్(సీపీఐ) ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తక్కువగా నమోదైంది.

మేలో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. కాబట్టి ఆర్‌బీఐ మరోసారి కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ అన్నారు. ఇటీవల సెంట్రల్ బ్యాంక్ రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకోవడంతో డిపాజిట్ పెరిగేకొద్దీ లిక్విడిటీ మెరుగ్గా ఉండటం కూడా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ, ఇటీవలి జీడీపీ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే, వడ్డీ రేట్లకు సంబంధించి విరామ నిర్ణయాన్ని కొనసాగిచవచ్చని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశీష్ పాండే వెల్లడించారు.


Tags:    

Similar News