RBI: ఓటీపీ, కేవైసీ వివరాలు షేర్ చేయొద్దని ఆర్‌బీఐ హెచ్చరిక
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అకౌంట్ లాగ్-ఇన్, ఓటీపీ, కేవైసీ వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఓటీపీ, కేవైసీ డాక్యుమెంట్ పేర్లతో జరుగుతున్న మోసాల గురించి వినియోగదారులను హెచ్చరించింది. ఆర్‌బీఐ పేరుతో జరుగుతున్న మోసపూరిత ప్రచారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ అకౌంట్ లాగ్-ఇన్, ఓటీపీ, కేవైసీ వివరాలను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని గురువారం ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఆర్‌బీఐ పేరును వాడుకుని మోసగాళ్లు వివిధ పద్దతుల్లో మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని సెంట్రల్ బ్యాంక్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. మోసగాళ్లు ఎక్కువగా నకిలీ లెటర్ హెడ్‌లు, నకిలీ ఈ-మెయిల్ అడ్రస్‌లను ఉపయోగించి ఆర్‌బీఐ ఉద్యోగుల పేర్లతో, లాటరీ, నిధుల బదిలీ, విదేశీ చెల్లింపులు, ప్రభుత్వ పథకాలు వస్తాయనే లాంటి ఆఫర్‌లు ఇస్తున్నారు. వాటిని పొందేందుకు కరెన్సీ ప్రాసెసింగ్ ఫీజు, ట్రాన్స్‌ఫర్, రెమిటెన్స్, ప్రొసీజర్ ఛార్జీల పేరుతో బాధితుల నుంచి డబ్బును దోచేస్తున్నారని ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా చిన్న, మధ్యస్థాయి వ్యాపారులను సైతం ప్రభుత్వం, ఆర్‌బీఐ అధికారుల పేరు చెప్పి మోసగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. కాల్స్, మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతుంటారని హెచ్చరించింది. అటువంటి వాటికి లొంగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.