ATM: పెరిగిన ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు
ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై రూ. 23 చొప్పున బ్యాంకులు వసూలు చేయనున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ఏటీఎంలలో లావాదేవీలు భారం కానున్నాయి. ఒక నెలలో ఉచిత లావాదేవీల పరిమితి తర్వాత విధించే ఛార్జీలను రూ. 2 పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బ్యాంకులకు అనుమతించింది. మే 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానుండగా, ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై రూ. 23 చొప్పున బ్యాంకులు వసూలు చేయనున్నాయి. సాధారణంగా కస్టమర్లు ఒక నెలలో సొంత బ్యాంకు ఏటీఎం నుంచి ఉచితంగా ఐదు సార్లు లావాదేవీలు(నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ సహా అన్నీ కలిపి) నిర్వహించవచ్చు. వేరే బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో ఐదు లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో మూడు లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఈ పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. ప్రస్తుతం రూ. 21 ఉన్న ఈ ఛార్జీని రూ. 23కి పెంచేందుకు ఆర్‌బీఐ అనుమతిస్తూ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడంతో ఏటీఎంల నిర్వహణ భారంగా మారింది. అయితే, తాజా పెంపు ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడే కస్టమర్లకు భారం అవనుంది.