భారత్‌లో సెమీకండక్టర్ నిపుణులకు భారీ డిమాండ్.. ఏడాదికి రూ.2.5 కోట్ల ప్యాకేజ్
భారత్‌లో సెమీకండక్టర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చిప్‌ల తయారీకి అవసరమైన నిపుణులకు భారీ డిమాండ్ నెలకొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో సెమీకండక్టర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చిప్‌ల తయారీకి అవసరమైన నిపుణులకు భారీ డిమాండ్ నెలకొంది. 2024లో మొత్తం ఉద్యోగాల్లో 40,000-50,000 మంది నిపుణులు ఈ రంగానికి కావాలని, ఇది గత ఏడాదితో పోలిస్తే 25-30 శాతం పెరుగుదల అని స్టాఫింగ్ కంపెనీ రాండ్‌స్టాండ్ తెలిపింది. అలాగే, ఈ రంగం రాబోయే ఐదేళ్లలో 8 లక్షల నుంచి 10 లక్షల ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని పేర్కొంది. టాటా గ్రూపుతో సహా ఈ రంగంలోకి $15 బిలియన్ల విలువైన పెట్టుబడులను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా చిప్‌ల తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి.
దీంతో ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్, ఎక్విప్‌మెంట్ సర్వీస్ ఇంజనీర్, పర్చేజ్ మేనేజర్‌లు, సెమీకండక్టర్ చిప్ డిజైన్, సెమీకండక్టర్ ఫాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ వంటి విభాగాల్లో నియామకాలు ఊపందుకుంటున్నాయి. ఎంట్రీ, మిడిల్-లెవల్ ఉద్యోగుల నియామకం పెరిగింది. సెమీకండక్టర్ తయారీ రంగంలో ఎంట్రీ లెవల్ డిజైన్ ఇంజనీర్‌లకు రూ. 15-20 లక్షల వరకు, సీనియర్లకు రూ. 2.5 కోట్ల వరకు వార్షిక జీతాలు లభిస్తాయని టాలెంట్ అడ్వైజరీ సంస్థ ABC మురళీ మోహన్ అన్నారు.
గుజరాత్, బెంగళూరు, తెలంగాణ, తమిళనాడు, అస్సాంలలో ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. చిప్ డిజైన్‌లో నిపుణుల కోసం కంపెనీలు కొత్తగా నియామకాలను చేపడుతున్నాయి. రానున్న రోజుల్లో నిపుణుల అవసరం మరింత పెరుగుతుందని రాండ్‌స్టాడ్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యెషాబ్ గిరి అన్నారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, గ్లోబల్‌గా ఇతర దేశాలతో పోలిస్తే వేగంగా ఈ రంగంలో ప్రధాన సెమీకండక్టర్ ఉత్పత్తిదారుగా ఉండటానికి తీవ్రంగా కృషి చేస్తుంది. యువత తమ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా నిపుణుల కొరతను ఎదుర్కొంటున్న ఈ రంగంలో వేగంగా తమ ప్రతిభకు అనుగుణంగా ఉపాధి పొందగలుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు.