PM Modi: డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డుకు ఎంపికవడంపై ఆర్‌బీఐని అభినందించిన ప్రధాని మోడీ
అవార్డును పొందడం నూతన ఆవిష్కరణలు, సామర్థ్యానికి ఆర్‌బీఐ ప్రాధాన్యతను సూచిస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాదికి సంబంధించి భారతీయ రిజర్వ్ యాంక్(ఆర్‌బీఐ) డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డ్ కోసం ఎంపికవడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యూకే సెంట్రల్ బ్యాంకు ఇచ్చే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డును పొందడం నూతన ఆవిష్కరణలు, సామర్థ్యానికి ఆర్‌బీఐ ప్రాధాన్యతను సూచిస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఇన్నోవేషన్ ద్వారా భారత ఫైనాన్స్ ఎకోసిస్టమ్ ఎప్పటికప్పుడు మరింత బలోపేతం అవుతోందని, తద్వారా ఎంతోమంది జీవితాలకు సాధికారత లభిస్తోందని మోడీ పేర్కొన్నారు. కాగా, గతవారం యూకే సెంట్రల్ బ్యాంకు నుంచి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డుకు ఎంపికైనట్టు ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీల రికార్డులను సురక్షితంగా స్టోర్ చేయగలిగే సారథి పోర్టల్‌తో పాటు యూజర్లు ఆర్బీఐకి సులభంగా రెగ్యులేటరీ అప్లికేషన్లను అందజేసే ప్రవాహ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినందుకు గానూ యూకే సెంట్రల్ బ్యాంకు ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రవాహ్, సారథి వంటి డిజిటల్ కార్యక్రమాలను ఆర్‌బీఐలోని డెవలపర్ బృందమే అభివృద్ధి చేసింది. ఆర్‌బీఐ ప్రవాహ్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 70 రెగ్యులేటరీ అప్లికేషన్లను డిజిటైజ్ చేసింది.