ప్రధాన రంగాల్లో మెప్పించని పీఎల్ఐ పథకం

ప్రధాన రంగాల్లో పెట్టుబడులు గతేడాది స్థాయిలో రావట్లేదని ఇంటర్-మినిస్టీరియల్ ప్యానెస్ చేపట్టిన సమీక్షలో తేలింది.

Update: 2024-02-12 10:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం కింద ఇప్పటికే పలు రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఈ పథకం విజవంతంగా కొనసాగుతున్నప్పటికీ కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో ఉండట్లేదని తెలుస్తోంది. ప్రధాన రంగాల్లో పెట్టుబడులు గతేడాది స్థాయిలో రావట్లేదని తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్స్‌టైల్స్, ఐటీ హార్డ్‌వేర్, స్పెషాలిటీ స్టీల్‌లో పెట్టుబడులు గణనీయంగా తగ్గాయని ఇంటర్-మినిస్టీరియల్ ప్యానెస్ చేపట్టిన సమీక్షలో తేలింది. 2023-24 ముగిసేలోపు రూ. 49,682 కోట్ల పెట్టుబడులు పీఎల్ఐ పథకం కింద వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు అంటే మొదటి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 14 రంగాల్లో రూ. 30,695 కోట్లకు పైగా వచ్చాయి. ఇది మొత్తం లక్ష్యంలో 61.8 శాతానికి సమానం. పైన పేర్కొన్న మూడు రంగాలు కాకుండా వైద్య పరికరాలు, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, ఏసీసీ బ్యాటరీలు, వైట్ గూడ్స్ వంటి ప్రధాన రంగాల్లో పీఎల్ఐ పథకం కింద పెట్టుబడులు నెమ్మదిస్తున్నాయి. మిగిలిన మొబైల్‌ఫోన్, బల్క్ డ్రగ్స్, ఫార్మా, టెలికాం, డ్రోన్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో మెరుగ్గా ఉన్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తి లేదా అమ్మకాలు, ఉపాధి లక్ష్యాలు సరైన దిశలోనే కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు ప్రభుత్వం అంచనాలను మించి వచ్చినప్పటికీ, అన్ని రంగాల్లో ఈ పురోగతి ఒకేలా లేదు. 2022-23లో అన్ని రంగాలకు కలిపి పీఎల్ఐ పథకాల కింద రూ. 60,345 కోట్ల లక్ష్యం నిర్దేశించగా, రూ. 75,917 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా రూ. 5.96 లక్షల కోట్లకు బదులు రూ. 5.78 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి లేదా అమ్మకాలు జరిగాయి. 2.54 లక్షల ఉద్యోగాలు వస్తాయని భావించగా 3.67 లక్షల మందికి ఉపాధి లభించింది. బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజ్‌ల కోసం పీఎల్ఐ పథకం కింద పెట్టుబడులు అనుకున్న విధంగా వచ్చినప్పటికీ, వాస్తవంలో ఉత్పత్తి లేదా అమ్మకాలు లక్ష్యం కంటే తక్కువగా ఉన్నాయి. ఆటో, ఆటో విడిభాగాల రంగాల్లో ఉత్పత్తి లేదా అమ్మకాలు అనుకున్న దానికంటే ఎక్కువే నమోదైనా, పెట్టుబడులు అంతగా రాలేదు. 

Tags:    

Similar News