పీఎల్ఐ పథకం అన్ని రంగాల వృద్ధికి కిక్‌స్టార్టర్

పథకం లబ్దిదారులను ప్రభుత్వం సేవలపై ఆధారపడేలా చేయడం కాదు. అయితే దీన్ని ఉత్పాదక రంగంలో బూస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు.

Update: 2024-02-04 13:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం కిక్‌స్టార్టర్‌గా ఉంటుందని, దాన్ని ఊతకర్రగా చూడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పీఎల్ఐ పథకం లబ్దిదారులతో జరిగిన ఓ ఇంటరాక్షన్‌లో పాల్గొన్న వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, 'ఈ పథకం లబ్దిదారులను ప్రభుత్వం సేవలపై ఆధారపడేలా చేయడం కాదు. దీన్ని ఉత్పాదక రంగంలో బూస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు. సుధీర్ఘ ప్రయాణానికి ఇదొక ప్రారంభ మద్దతు మాత్రమే. అంతిమంగా పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు దీన్ని వినియోగించుకోవాలని' అన్నారు. పీఎల్ఐ పథకానికి సంబంధించి చాలా సూచనలు, కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వాటిని పరిష్కరించడంలో ఎలాంటి జాప్యం జరగదని హామీ ఇస్తున్నట్టు పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, 'ఈ పథకం భవిష్యత్తులో ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఆర్థికవ్యవస్థకు మద్దతివ్వగలదు. పీఎల్ఐ ద్వారా దేశ తయారీ రంగాన్ని మార్చగలిగే అవకాశం పీఎల్ఐ పథకంతో వీలవుతుందని' తెలిపారు. ఈ పథకంతో కొన్ని రంగాలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News