ఐపీఓకు రానున్న పెన్నుల తయారీ బ్రాండ్ 'ఫ్లెయిర్'!

ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ త్వరలో ఐపీఓకు రానుంది.

Update: 2023-07-16 16:12 GMT

ముంబై: ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ త్వరలో ఐపీఓకు రానుంది. ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 745 కోట్ల మేర నిధులను సమీకరించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. కంపెనీ అందజేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టర్(డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం, ఐపీఓ మొత్తం రూ. 365 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ ఎంటీటీల నుంచి రూ. 380 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో 100 శాతం వాటాను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు కలిగి ఉన్నాయి.

ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కంపెనీ తన పెన్నుల తయారీ ప్లాంటు ఏర్పాటుతో పాటు మూలధన అవసరాలకు, ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్టు తెలిపింది. ఫ్లెయిర్ బ్రాండుతో దేశీయ మార్కెట్లో ఆదరణ కంపెనీ 45 ఏళ్లుగా పెన్నుల తయారీ రంగంలో మొదటి మూడు సంస్థల్లో ఒకటిగా ఉంది. కంపెనీ పెన్నులతో పాటు స్టేషనరీ ఉత్పత్తులు, కాలిక్యులేటర్ సహా ఇతర రైటిన్ పరికరాలను తయారు చేస్తుంది. అలాగే గృహోపకరణాలు, స్టీల్ బాటిళ్ల తయారీలోనూ విస్తరించింది.


Similar News