పెళ్లిళ్ల సీజన్‌.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధరలు

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సుమారు మూడు నెలల నుంచి గోల్డ్ ఆల్ టైం రికార్డు ధరకు చేరింది.

Update: 2024-10-22 13:37 GMT

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సుమారు మూడు నెలల నుంచి గోల్డ్ ఆల్ టైం రికార్డు ధరకు చేరింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.80 వేల వరకూ ఉండడంతో కొనాలంటేనే పసిడి ప్రియులు భయపడుతున్నారు. అసలే రాబోయేది పెండ్లిళ్ల సీజన్ కావడం, బంగారం ఎంతో కొంత తప్పనిసరిగా కొనాల్సి రావడంతో భారీ మొత్తంలో డబ్బులు పెట్టి మరి కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు వెండి ధరలు సైతం పెరిగిపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా, ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షితమైన సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు డిమాండ్ పెరిగి సప్లయ్ తగ్గడం వల్ల బంగారం ధరలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

రూ.80 వేలకు చేరిన పసిడి ధర

దేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆభరణాల వ్యాపారుల నిరంతర కొనుగోళ్లతో పాటు ప్రపంచ మార్కెట్లలో బలమైన డిమాండ్‌తో దేశ రాజధానిలో బంగారం ధర శనివారం 72,930 పలికింది. అదే హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.రూ.79,420కి చేరింది. వివిధ రకాల పన్నులు కలుపుకుని ఇది దాదాపు రూ.80 వేలు దాటొచ్చు. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి హైదరాబాద్‌లో రూ. 72,800 పలికింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పశ్చిమాసియాలో వరుసగా కొనసాగుతున్న యుద్ధ భయాలతో బంగారం ధర 2024లో ఇప్పటివరకు 30 శాతం పెరిగింది. వెండి కూడా కిలో రూ.1,07,000లకు చేరుకున్నది. జీఎస్టీ లాంటి పన్నులు కలుపుకుంటే ఇది మరింత ఎక్కువ కావొచ్చు.

2024లో 30 శాతం పెంపు

పశ్చిమాసియాలో భయానక యద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధ భయాలతో బంగారం ధర 2024లో 30 శాతం పెరిగింది. వెండి సైతం కిలో రూ.1,07,000 చేరుకుంది. జీఎస్టీ లాంటి పన్నులు కలుపుకుంటే ఇది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు ఇంకా తగ్గించొచ్చని, దీని వల్ల పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం సైతం గోల్డ్ రేట్స్ పెరిగేందుకు ఓ కారణం కావొచ్చని అనలిస్టులు చెబుతున్నారు.

భౌగోళిక రాజకీయ అనిశ్చితి

కొన్నేండ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరపోరు నడుస్తున్నది. ఎంతో మంది పౌరులు, సైనికులు చనిపోయారు. రూ.కోట్లాది ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇరు దేశాలు రాజీపడకుండా యుద్ధ భూమిలో పోరు సాగిస్తున్నారు. మరో వైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్యా యుద్ధం సాగుతున్నది. ఇందులోనూ భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. వేలాది మంది చనిపోయారు. అయితే యుద్ధ భయాలతో పెట్టుబడిదారులు ఇతర ఆస్తులను నివారిస్తున్నారు. దీని వల్ల గోల్డ్ విలువ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు దేశంలో కొనసాగుతున్న మారకపు రేటుపై బంగారం ధరలు ఆధారపడి ఉన్నందున గోల్డ్ రేట్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. బంగారాన్ని యూఎస్‌డీలో కొనుగోలు చేయడం, విక్రయించడంతో దాని ధరపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు ప్రపంచ స్థాయిలో, అనిశ్చితి టైంలో రానున్న రోజుల్లో బంగారం ధర పెరుగుతుందని తరచుగా వర్తకులు, పెట్టుబడిదారుల ఊహాజనిత కొనుగోళ్లు ధర పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. అలాంటి సమయంలో మార్కెట్లు గందరగోళంలో ఉండడంతో ఇతర ఆర్థిక సాధనాలు తమ ఆకర్షణను కోల్పోతాయి. ఫలితంగా బంగారం లాభదాయకమైన ఆస్తిగా మారుతుంది. దీంతో ధర మరింత పెరిగేందుకు కారణం అవుతుంది. అదే విధంగా గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్-ఫండ్స్ నుంచి డిమాండ్ ఉండడం సైతం గోల్డ్ రేట్స్ పెరిగేందుకు కారణం అవుతుంది.

కరెన్సీ మారకం రేటు

దేశంలో కొనసాగుతున్న మారకపు రేటుపై ఆధారపడి బంగారం ధరల పెరుగుదల లేదా తగ్గుదలతో మార్పులు ఉంటాయి. బంగారాన్ని యూఎస్‌డీ‌లో కొనుగోలు చేయడం, విక్రయించడం వల్ల ఇది దాని ధరపై గణనీయమైన ప్రభావం చూపుతుందని తెలుస్తున్నది. మరో వైపు గోల్డ్ ధరలు యూఎస్ డాలర్ పైనా ఆధారపడి ఉంటాయి. డాలర్ బలహీన పడితే బంగారం ధర పెరుగుతుంది. బలపడితే ధర తగ్గుతుంది. అలాగే దేశంలోని ద్రవ్యోల్బణంతో సైతం బంగారం ధరలు ముడిపడి ఉంటాయి. కరెన్సీ విలువ క్షీణిస్తే బంగారం ధర పెరుగుతుంది.

అమెరికా ఎలక్షన్స్ సైతం ఓ రిజనే..

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల మీదే చర్చ నడుస్తున్నది. కమలా హ్యారీస్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే టెన్షన్ ఉన్నది. అయితే అమెరికా ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితాలు తేలే వరకూ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులుగా ఉంటాయని చెబుతున్నారు. దీని ప్రభావం బంగారం ధరల పెరుగుదల, తగ్గుదలపై ఉంటుందని తెలుస్తున్నది.

రెండు నెలల్లో సుమారు 40 లక్షల వివాహాలు

దేశంలో పండుగల సీజన్ ముగిసిన తర్వాత పెండ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతుంది. ఇక దేశంలో పెండ్లిళ్లు ఎలా చేసుకుంటారో చెప్పనక్కర్లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సైతం జీవితంలో ఒకటే సారి కదా పెండ్లి చేసుకునేది అంటూ.. రూ.లక్షలు ఖర్చు చేసి చేసుకుంటారు. డబ్బున్న వాళ్లు రూ.కోట్లు ఖర్చు చేసి చాలా ధూంధాంగా చేసుకుంటారు. సాధారణంగా అక్టోబర్‌లో దుర్గాపూజ, నవరాత్రి, దీపావళి ముగిసిన తర్వాత, నవంబర్-డిసెంబర్‌లో పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది. ఆ రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సుమారు 40 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. ఈ రెండు నెలల పాటు జరిగే పెండ్లిళ్లకు సుమారు రూ.4 లక్షల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. ఈ ఖర్చులో బంగారు కొనుగోలు సైతం ప్రభావాన్ని చూపిస్తుంది. దేశంలో ఏ మతానికి చెందిన పెండ్లి జరిగినా ఖచ్చితంగా అబ్బాయి, అమ్మాయికి బంగారం పెట్టాల్సిందే. గోల్డ్ పెట్టడమూ ఓ ప్రెస్టేజ్‌గా తీసుకుంటారు. ఎంత ధర ఉన్నా.. కొనుగోలు చేసి పెడుతుంటారు. ఈ రెండు నెలల్లో కొనుగోలు ఎక్కువగా ఉండటం, డిమాండ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధర విపరీతంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు దేశంలో అనేక మంది పండుగలకు సైతం బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. కొనుగోలు ఎక్కువగా ఉండడం కూడా గోల్డ్ ధర పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని తెలుస్తున్నది.



షేర్ల పతనం, రియల్ ఎస్టేట్ కుదేలు: డాక్టర్ అక్కినపల్లి మీనయ్య, ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షుడు.

చాలా రోజుల నుంచి షేర్ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలు అయ్యింది. ప్రస్తుతం చాలామంది భూములు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. భూములకు పెట్టే డబ్బులు బంగారం కొనేందుకు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతున్నది. గోల్డ్ రేట్ పెరగడానికి యుద్ధ భయాలు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. భారతదేశంలో బంగారం కొనేందుకు చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. భవిష్యత్తులో ఇంకా ధరలు పెరిగే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు పెరిగిపోతున్నాయి. అమెరికా కరెన్సీ బలహీన పడడం వల్ల బంగారం రేటు పెరిగిపోతున్నది. దీనికి తోడు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు గోల్డ్ కొనడం ఆనవాయితీగా వస్తుండడంతో చాలా మంది కొనుగోలు చేయడం వల్ల ధరలు పెరిగిపోతున్నాయి.



 


Tags:    

Similar News