Quick Commerce Platforms: రిటైల్ స్టోర్ల కంటే తక్కువకే బంగారు నాణెల డెలివరీ
జెప్టో, బ్లింక్ఇట్ వంటి ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫామ్‌లు రిటైల్ స్టోర్ల కంటే తక్కువకు బంగారు నాణెలను అందిస్తున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ధనత్రయోదశి సందర్భంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ కంపెనీలు వినియోగదారులకు భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. అమ్మకాలు పెంచుకోవడమే కాకుండా విస్తరణ ద్వారా కస్టమర్లను ఆకట్టుకునేందుకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. జెప్టో, బ్లింక్ఇట్ వంటి ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫామ్‌లు రిటైల్ స్టోర్ల కంటే తక్కువకు బంగారు నాణెలను అందిస్తున్నాయి. మలబార్ గోల్డ్‌తో భాగస్వామ్యం ద్వారా జెప్టో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారు నాణెంను రూ. 8,209కే విక్రయిస్తోంది. ఆన్‌లైన్ బంగారు కాయిన్స్ విక్రయించే ఆగ్మోంట్ 1 గ్రాము 24 క్యారెట్ల నాణెంను రూ. 8,199కే విక్రయిస్తోంది. అలాగే జోయలుక్కాస్‌తో ఒప్పందం ద్వారా బ్లింక్ఇట్ 24 క్యారెట్ల 1 గ్రాము కాయిన్‌ని రూ. 8,248కి అందిస్తోంది. ప్రధానంగా జెప్టో, బ్లింక్ఇట్, బిగ్‌బాస్కెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఈ దీపావళికి బంగారు, వెండి నాణెలను కేవలం 10 నిమిషాల్లో ఇంటి వద్దకు అందిస్తున్నాయి. రిటైల్ స్టోర్లలో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారు నాణెం రూ. 8,460 వరకు ఉన్నాయని జ్యువెలరీ వ్యాపారులు తెలిపారు.
ధన్‌తేరాస్ సాంప్రదాయంగా ఇత్తడి, వెండి, బంగారం వంటి విలువైన వస్తులను కొనడం శుభప్రదనంగా ప్రజలు భావిస్తారు. అలా కొనుగోలు చేయడం ద్వారా అదృష్టం, విజయం, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ ఉంటుందని కోరుకుంటారు. అయితే, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు 1 గ్రాము కాయిన్స్ మాత్రమే కాకుండా వినియోగదారుల ఆసక్తిని బట్టి 22 క్యారెట్ల కాయిన్స్, 0.1 గ్రాము, 0.5 గ్రాము, 0.25 గ్రాము వంటి బరువులలో కూడా అందిస్తున్నాయి. 5 గ్రాము, 11.55 గ్రాములు, 20 గ్రాముల వరకు కూడా స్వచ్ఛమైన వెండి నాణెలను అందిస్తున్నాయి. ఇక, మంగళవారం బంగరాం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 80,450 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 73,750 ఉంది. వెండి కిలో రూ. 1,06,900 ఉంది.