చర్యకు ప్రతిచర్య.. మైక్రోసాఫ్ట్‌ అజూర్ నుంచి వైదొలిగిన ఓలా

ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. ఓలాకు క్లౌడ్ సర్వీస్ సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్ అజూర్‌తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు

Update: 2024-05-11 14:07 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. ఓలాకు క్లౌడ్ సర్వీస్ సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్ అజూర్‌తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇకమీదట ఓలా తన స్వంత AI సంస్థ క్రుట్రిమ్ నుంచి క్లౌడ్ సర్వీస్ సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని లింక్డ్‌ఇన్‌లోని ఏఐ చాట్‌బాట్‌లో భవిష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకోవడానికి భవిష్ అగర్వాల్ ఎవరు అని ప్రశ్నించారు. అయితే సమాధానంగా చాట్‌బాట్‌ అతడు/ఆయనకు బదులుగా వారు/వాళ్లు అని చూపించింది. దీనిని స్క్రీన్‌షాట్ తీసిన పోస్ట్ చేసిన భవిష్ ‘పాశ్యాత్య విధానాలను గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందని’ కామెంట్ పెట్టారు.

అయితే ఈ పోస్ట్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ లింక్డ్‌ఇన్ తొలగించింది. దీనిని తప్పుబట్టిన ఆయన ప్రతిచర్యగా మైక్రోసాఫ్ట్‌తో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో అజూర్‌‌కు Ola అతిపెద్ద కస్టమర్. ఇప్పుడు రెండింటి మధ్య డీల్ క్యాన్సల్ కావడం వల్ల దాదాపు రూ.100 కోట్ల నష్టం కలిగే అవకాశం ఉంది.

వచ్చే వారంలోగా ఓలా క్లౌడ్ సర్వీస్ సేవలను క్రుట్రిమ్‌కు తరలించాలని భవిష్ అగర్వాల్ సూచించారు. అలాగే, అజూర్ నుండి బయటికి వెళ్లాలనుకునే ఏ ఇతర డెవలపర్ అయినా ఏడాది పాటు ఉచిత క్లౌడ్ సర్వీస్ సేవలను అందిస్తామని ఆయన ప్రకటించారు. డెవలపర్‌లు, సంస్థలు తమ ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి అధునాతన GPU వనరులను యాక్సెస్ చేయడంలో సహాయపడటానికి Krutrim క్లౌడ్ ఉపయోగపడుతుందని భవిష్ అగర్వాల్ చెప్పారు.


Similar News