'హార్ముజ్' జలసంధి మూసేస్తే చమురు ధరలకు రెక్కలు
ప్రధానంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణతో భారత్‌తో పాటు పలు దేశాలు చమురు ధరల భారాన్ని చూడనున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ నుంచి భారత్ వంటి దేశాలు ముడి చమురును దిగుమతి చేసుకునే హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటే చమురు, ఎల్‌ఎన్‌జి(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధరలు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. ప్రధానంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణతో భారత్‌తో పాటు పలు దేశాలు చమురు ధరల భారాన్ని చూడనున్నాయి. గత కొద్ది రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. వివాదం తర్వాత ముడి చమురు ధరలు బ్యారెల్ 90 డాలర్లకు చేరుకున్నాయి. ఇరాన్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగడంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు వివిధ దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా లేదా పాక్షికంగా మూసేస్తే చముడు చమురు, ఎల్ఎన్‌జీ ధరలు పెరగనున్నాయి. హర్మూజ్ జలసంధి ఒమన్, ఇరాన్ సముద్ర మార్గంలో 40 కిలోమీటర్లతో ఇరుకైన ప్రదేశం. అందులో 2కిలోమీటర్ల వరకు నౌకల రాకపోకలకు నావిగేషన్ ఛానల్ ఉంది. రోజుకు 2.1 కోట్ల బ్యారెళ్ల చముదు సౌదీ, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాన్, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అవుతుంది. ఈ మొత్తం ప్రపంచ రోజువారి వినియోగం 21 శాతానికి సమానం. ప్రపంచ ఎల్ఎన్‌జీ వినియోగం 20 శాతం కూడా ఈ మార్గంలోనే సరఫరా అవుతుంది.
ఇక, భారత్‌కు కావాల్సిన 85 శాతం ముడిచమురు సౌదీ, ఇరాక్, యూఏఈల నుంచి వస్తోంది. ఖతార్ నుంచి ఎన్ఎన్‌జీ సైతం హర్మూజ్ నుంచి సరఫరా అవుతోంది. ఈ క్రమంలో దీన్ని ఇరాన్ అడ్డుకుంటే చమురు రవాణాకు ఎర్ర సముద్రం మాత్రమే ప్రత్యామ్నాయం అవుతుంది. అయితే, ఎల్ఎన్‌జీ దిగుమతి ఆగిపోతుంది. ఈ పరిణామాలతో భారత్‌లో ఇంధన ధరలు ప్రభావితమై పెరుగుతాయని అంచనా. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత క్షీణిస్తే ముడిచమురు ధరలు పెరగనున్నాయి. అయితే, రష్యా నుంచి ఇంధన దిగతులు చేసుకుంటున్న కారణంగా భారత్‌కు కొంత ఊరట లభిస్తుందని విశ్లేషకులు వెల్లడించారు.