ప్రత్యేక విభాగంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సెబీ ఆమోదం!
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎస్ఎస్ఈ) ఏర్పాటుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది.
ముంబై: సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎస్ఎస్ఈ) ఏర్పాటుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ప్రకటనలో ప్రత్యేక విభాగంగా ఎస్ఎస్ఈని ఏర్పాటు చేస్తూ మార్చి నుంచి మొదలవుతుందని వెల్లడించింది. సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల జాబితా కోసం ఎస్ఎస్ఈ పనిచేస్తుంది. ఈ సంస్థలకు మూలధనాన్ని ఈక్విటీగా, డెట్‌గా లేదా మ్యూచువల్ ఫండ్ వంటి యూనిట్లుగా సమీకరించడానికి ఎస్ఎస్ఈ సహాయం చేస్తుంది. సామాజిక కార్యక్రమలాకు ఆర్థిక సాయం చేయడానికి, నిధుల సమీకరణ, వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు ఎస్ఎస్ఈ ఉపయోగపడుతుంది.
అందుకు కొత్త మార్గాన్ని అందించే లక్ష్యంతోనే దీని ఏర్పాటు జరుగుతున్నట్టు ఎస్ఎస్ఈ తెలిపింది. దీని ప్రకారం, ఏదైనా సామాజిక సంస్థ, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఫర్-ప్రాఫిట్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌లు ఈ ఎస్ఎస్ఈలో రిజిస్టర్, లిస్టింగ్ అవ్వొచ్చు. తద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఈ సంస్థల షేర్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఈ విభాగంలో అర్హత కలిగిన నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌లు నమోదు చేసుకుని, పెట్టుబడుల సమీకరణకు వెళ్లవచ్చు. ఆన్‌బోర్డింగ్ అనంతరం ఎన్‌పీఓలు పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్(జెడ్‌సీజెడ్‌పీ) వంటి వాటిని జారీ చేసి నిధుల సేకరణ ప్రక్రియను చేపట్టవచ్చు. వీటి జారీకి నిబంధనలకు అనుగుణంగా సెబీ రూ. కోటి, సబ్‌స్క్రిప్షన్ కనీస అప్లికేషన్ రూ. 2 లక్షలుగా నిర్ణయించింది.