UPI Cash Deposit: డెబిట్ కార్డుతో పనిలేకుండా యూపీఐతో నగదు డిపాజిట్ సౌకర్యం
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ యూపీఐ-ఐసీడీ సేవలను ప్రారంభించారని ఎన్‌పీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఇకపై క్యాష్ డిపాజిట్ మరింత సులభతరం కానుంది. దీనికోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్‌పీసీఐ) కీలక సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏటీఎం సెంటర్లలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు డెబిట్ కార్డు అవసరం లేకుండా యూపీఐ నుంచి చేసే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి గురువారం గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2024 కార్యక్రమంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ యూపీఐ ఇంటరాపరేబుల్ క్యాష్ డిపాజిట్ (యూపీఐ-ఐసీడీ) సేవలను ప్రారంభించారని ఎన్‌పీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ సేవల ద్వారా బ్యాంకులు, వైట్‌లేబుల్ ఆపరేటర్లు(డబ్ల్యూఎల్ఓ) నిర్వహించే ఏటీఎం సెంటర్‌లలో డెబిట్ కార్డుతో పనిలేకుండా డబ్బు డిపాజిట్ చేయవచ్చు. సొంత అకౌంట్‌లోనే కాకుండా ఇతర బ్యాంకు అకౌంట్లలో సైతం డబ్బు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికోసం యూపీఐ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లలో ఏదైనా ఒకటి ఉపయోగించి డిపాజిట్ చేయవచ్చు. దశలవారీగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది.