స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ ప్రతినిధులతో సమావేశమైన ఆర్థికమంత్రి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం స్టార్టప్‌లు, ఫిన్‌టెక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో సహా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు.
దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం స్టార్టప్‌లు, ఫిన్‌టెక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో సహా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2047 నాటికి 'వికసిత్ భారత్' దార్శనికతను సాధించడానికి కావలసిన కార్యాచరణ ఆలోచనలను వారితో పంచుకున్నారు. బ్యాంకింగ్, బీమా రంగాలను బలోపేతం చేయడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ల అభివృద్ధి జరగాలని ఆమె అన్నారు. భారతదేశ వృద్ధి పథాన్ని వేగవంతం చేయడానికి సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల మండలి మార్చి 3న `వికసిత్ భారత్ 2047' విజన్ డాక్యుమెంట్‌పై మేధోమథన సెషన్‌ను నిర్వహించిన వారం తర్వాత సీతారామన్ ఈ పరస్పర చర్చలో పాల్లొన్నారు. దీనిలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం పొంది 100 సంవత్సరాలు పూర్తయ్యే సంవత్సరం నాటికి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం ఈ వికసిత్ భారత్ 2047 లక్ష్యం. ప్రభుత్వం 2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023-24 నాటికి భారతదేశ జీడీపీ వృద్ధి 7.6 శాతంగా ఉంటుందని అంచనా. ఫిబ్రవరిలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ 2030 నాటికి వృద్ధి రేటు 7 శాతానికి పైగా పెరగడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.