తిరిగి ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానానికి ఎలన్ మస్క్!

ప్రపంచ సంపన్నుల జాబితాలో టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు.

Update: 2023-02-28 09:51 GMT

న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుల జాబితాలో టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. టెస్లా కంపెనీ షేర్లలో ర్యాలీ కారణంగా ఎలన్ మస్క్ సంపద పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మంగళవారం నాటికి 187 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎలన్ మస్క్ తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఎల్‌వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 185 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు.

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎలన్ మస్క్ సంపద 38 శాతం పెరిగింది. గతేడాది డిసెంబర్ సమయంలో మస్క్ ఆస్తులు 200 బిలియన్ డాలర్లకు పైనే ఉన్నాయి. అయితే, టెస్లా షేర్లలో భారీ పతనం కారణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో ఎక్కేంత స్థాయిలో ఎలన్ మస్క్ సంపద ఒక్కసారిగా పతనమైంది. ముఖ్యంగా కరోనా, చైనాలో కఠిన లాక్‌డౌన్ వంటి పరిణామాలతో టెస్లా షేర్లు సగానికి పైగా పడిపోయాయి. దానివల్ల 2022 ఏడాది మొత్తంలో ఎలన్ మస్క్ సంపద రికార్డు స్థాయిలో క్షీణించింది. ఆ సమయంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద పుంజుకోవడంతో ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడి స్థానం నుంచి పడిపోయారు.

ఇక, ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్ నుంచి 81.1 బిలియన్ డాలర్ల(రూ. 6.70 లక్షల కోట్ల)తో 10వ స్థానంలో ఉన్నారు. ఇక, హిండెన్‌బర్గ్ దెబ్బకు సంపదను కోల్పోయిన గౌతమ్ అదానీ 37.7 బిలియన్ డాలర్ల(రూ. 3.12 లక్షల కోట్ల)తో 32వ స్థానంలో ఉన్నారు. కాగా, ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలీయనీర్ల జాబితా ప్రకారం, ఇప్పటికీ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 205.4 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, ఎలన్ మస్క్ 197.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో ముఖేశ్ అంబానీ ఎనిమిదవ స్థానంలో ఉన్నారు.

Tags:    

Similar News