2027 నాటికి ఉద్యోగాల తీరులో భారీ మార్పులు: WEF!

శతాబ్దానికి ఒకసారి వచ్చే మహమ్మారి, ఆటోమేషన్ వంటి పరిణామాల కారణంగా రానున్న రోజుల్లో ఉద్యోగాల తీరు గణనీయంగా మార్పులకు లోనవుతోందని ఓ నివేదిక అభిప్రాయపడింది.

Update: 2023-05-01 13:12 GMT

న్యూఢిల్లీ: శతాబ్దానికి ఒకసారి వచ్చే మహమ్మారి, ఆటోమేషన్ వంటి పరిణామాల కారణంగా రానున్న రోజుల్లో ఉద్యోగాల తీరు గణనీయంగా మార్పులకు లోనవుతోందని ఓ నివేదిక అభిప్రాయపడింది. రాబోయే ఐదేళ్ల వరకు ఈ మార్పు కొనసాగుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) తెలిపింది.

'ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్-2023' పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం, వేగంగా జరుగుతున్న ఈ మార్పుల వల్ల మొత్తం ఉద్యోగాల కల్పన తగ్గనుంది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగాలు మారనున్నాయి. భారత్‌లో ఇది 22 శాతంగా ఉంటుందని నివేదిక వెల్లడించింది. 2023-2027 మధ్య కాలంలో సుమారు 6.9 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరగనుండగా, అదే సమయంలో ఇప్పుడున్న ఉద్యోగాల్లో 8.3 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంచనా.

ప్రధానంగా ఉద్యోగాల మార్పునకు గ్రీన్ ఎనర్జీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సరఫరా వ్యవస్థ స్థానికీకరణ, పర్యావరణ, సామాజిక, పాలనపరమైన(ఈఎస్‌జీ) అంశాలు దోహదపడనున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, సరఫరా సమస్యలు ప్రధానంగా ఉండనున్నాయి. అత్యాధునిక సాంకేతికత, డిజిటలీకరణ ద్వారా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా విభాగాల్లో ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. దీనివల్ల దీర్ఘకాలంలో ఉద్యోగాల కల్పన మరింత మెరుగ్గా ఉంటుందని నివేదిక పేర్కొంది.

Tags:    

Similar News