SEBI: సెబీ మాజీ చీఫ్ మాధవి పూరి బుచ్‌తో పాటు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు
మాధవి బుచ్‌తో పాటు మరో ఐదుగురు అధికారులపై కేసు నమోదుకు ఆదేశించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చీఫ్ మాధవి పూరి బుచ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ముంబై స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టాక్ మార్కెట్లలో అవకతవకలు, నియంత్రణాపరమైన ఉల్లంఘనల నేపథ్యంలో మాధవి బుచ్‌తో పాటు మరో ఐదుగురు అధికారులపై కేసు నమోదుకు ఆదేశించింది. స్టాక్ మార్కెట్లలో కంపెనీల లిస్టింగ్‌కు సంబంధించిన ప్రక్రియలో ఆర్థిక మోసాలు జరిగాయని, అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తి ఎస్ఈ బంగర్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. సెబీ అధికారులు తమ విధుల్లో విఫలమయ్యారని, స్టాక్ మార్కెట్లో అవకతవకలకు, కార్పొరేట్ మోసానికి పాల్పడినట్టు పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు గతేడాది నుంచి మాధవి పూరి బుచ్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త ధావల్ బుచ్‌కు అదానీ గ్రూప్‌నకు చెందిన విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. అయితే, బుచ్ దంపతులు ఆరోపణలను వ్యతిరేకించారు. అవన్నీ నిరాధారమైనవని, తమ ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు.