నెలకు రూ. 17,436 సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌తో కొత్త మారుతీ స్విఫ్ట్ విడుదల
ఈ కారు ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మోడల్ రూ. 9.64 లక్షలు వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకు తన కొత్త స్విఫ్ట్ 2024 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 6.49 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మోడల్ రూ. 9.64 లక్షలు(ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్త స్విఫ్ట్ కార్డులో కంపెనీ అనేక భద్రతా ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రామాణికమైన ఆరు ఎయిర్‌బ్యాగులు కాకుండా 40కి పైగా కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్లు ఉన్నాయి. తొమ్మిది రంగుల్లో అందుబాటులో ఉండగా మాన్యూవల్ వేరియంట్ లీటర్‌కు 24.8 కిలోమీటర్లు, ఆటోమెటిక్ వేరియంట్ 25.75 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటొ, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. కొత్త స్విఫ్ట్ కారు కోసం ఇప్పటికే కంపెనీ రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్ చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. అంతేకాకుండా నెలకు రూ. 17,436 సబ్‌స్క్రిప్షన్ ద్వారా కూడా ఈ కారును ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ ఖర్చులో వాహన రిజిస్ట్రేషన్, నిర్వహణ, బీమా, రోడ్‌సైడ్ సర్వీస్ వంటి సేవలు ఉంటాయి.