చిప్‌ల కొరతతో 4 లక్షల యూనిట్ల ఆర్డర్లు పెండింగ్: మారుతీ సుజుకి!

ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు దేశీయ అతిపెద్ద

Update: 2023-05-28 13:01 GMT

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తెలిపింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తిరిగి ఉత్పత్తిని పెంచగలమని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. చిప్‌ల కొరత కొన్ని నెలల నుంచి కొనసాగుతోందని, ఇది దేశీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ తీర్చే స్థాయిలో లేకపోవడంతో సరఫరాపై ప్రభావం పెరిగిందని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 1.7 లక్షల యూనిట్ల ఉత్పత్తిని కోల్పోయింది.

2022-23 చివరి త్రైమాసికంలో ఒక్కటే దాదాపు 45 వేల యూనిట్ల ఉత్పత్తిని కోల్పోయామని, చివరి జనవరి-మార్చిలో 38 వేల యూనిట్ల ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితుల మధ్య ఏప్రిల్‌లో తగ్గిన ఉత్పత్తి మే, జూన్‌లలోనూ కొనసాగుతుందని శశాంక్ అభిప్రాయపడ్డారు. డిమాండ్ అధికంగా ఉండటంతో కంపెనీ పెండింగ్ ఆర్డర్లు 4 లక్షల యూనిట్లకు పెరిగింది. అందులో అత్యధికంగా లక్ష యూనిట్ల బుకింగ్‌తో ఎర్టిగా మోడల్ అగ్రస్థానంలో ఉంది. ఎర్టిగా తర్వాత కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజా కోసం 60 వేల యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిమ్నీ, ఫ్రాంక్స్ వంటి కొత్త వాటికి 30 వేల యూనిట్ల కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. జూలై నాటికి పరిస్థితులు చక్కబడితే ఉత్పత్తిని పెంచి ఆర్డర్ల సంఖ్య తగ్గించుకుంటామని శశాంక్ పేర్కొన్నారు.

Tags:    

Similar News