భారత్ చాలా ముఖ్యమైన మార్కెట్: మలేషియా ఎయిర్‌లైన్స్

కార్యకలాపాల పరంగా భారత్ తమకు అత్యంత ముఖ్యమైన దేశమని మలేషియా ఎయిర్‌లైన్స్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-09-15 14:48 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కార్యకలాపాల పరంగా భారత్ తమకు అత్యంత ముఖ్యమైన దేశమని మలేషియా ఎయిర్‌లైన్స్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పెరుగుతున్న అవకాశాల నేపథ్యంలో మరిన్ని విమాన సేవలు అందించడానికి ప్రణాళికలు చేస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాతుక్ కెప్టెన్ ఇజం ఇస్మాయిల్ ఆదివారం చెప్పారు. మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం తొమ్మిది భారతీయ నగరాలకు విమానాలు నడుపుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అమృత్‌సర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చిలకు రోజువారీ విమానాలను నడుపుతోంది. అహ్మదాబాద్, త్రివేండ్రంకు వారానికి నాలుగు సర్వీసులను అందిస్తుంది. అయితే ఈ రెండు ప్రాంతాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, దీని కోసం మరిన్ని విమానాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ఎండీ చెప్పారు.

భారతదేశం- మలేషియా మధ్య ద్వైపాక్షిక చర్చలు సానుకూలంగా ఉన్నాయి, దీంతో ఇరు దేశాల మధ్య మరింత కనెక్టివిటీని పెంచడానికి, భారత్‌లోని నాన్-మెట్రో నగరాలకు మరిన్ని సేవలను అందించవచ్చని అధికారి అన్నారు. 2025లో ఇరు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులను అందించే ప్రణాళికలపై చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.


Similar News