బ్యాంకులు, బంగారంలో పొదుపునకే ఎక్కువ మంది ఆసక్తి
దేశంలో చాలామంది తమ సొమ్మును దాచుకునేందుకు బ్యాంకులనే ఎక్కువగా విశ్వసిస్తున్నారని ఓ నివేదిక తెలిపింది. ..
న్యూఢిల్లీ:దేశంలో చాలామంది తమ సొమ్మును దాచుకునేందుకు బ్యాంకులనే ఎక్కువగా విశ్వసిస్తున్నారని ఓ నివేదిక తెలిపింది. ప్రతి వందమందిలో 77 మంది నగదును పొదుపు చేసేందుకు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారని మనీ9 అనే సంస్థ వెల్లడించింది. 'పర్సనల్ ఫైనాన్స్ పల్స్' పేరుతో చేసిన ఈ సర్వేలో ఈ ఏడాది 77 శాతం మంది బ్యాంకుల్లో డిపాజిట్ చేయగా, దీని తర్వాత 21 శాతం మంది తమ పొదుపును బంగారంపై పెట్టినట్టు నివేదిక వెల్లడించింది. ఇక స్టాక్ మార్కెట్లలో పెట్టేవారు 3 శాతం నుంచి 9 శాతానికి పెరిగారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగారు. ఇక, 2023లో 27 శాతం కుటుంబాలు జీవిత బీమా పాలసీలను తీసుకోగా, ఇది గతేడాది నమోదైన 19 శాతం కంటే పెరగడం గమనార్హం. అయితే, ఇప్పటికీ 53 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా కవరేజీ లేదని నివేదిక పేర్కొంది.