జూన్ నెల అమ్మకాల్లో అదరగొట్టిన మహీంద్రా

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ జూన్ 2024లో అమ్మకాల పరంగా బలమైన వృద్దిని సాధించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది

Update: 2024-07-01 08:27 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ జూన్ 2024లో అమ్మకాల పరంగా బలమైన వృద్దిని సాధించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం దాని వాహన అమ్మకాలు ఈ నెలలో 69,397 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది ఎగుమతులతో సహా 11 శాతం వృద్ధిని సాధించింది. ముఖ్యంగా వీటిలో ఎస్‌యూవీ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపించడంతో దేశీయ మార్కెట్లో ఈ విభాగంలో 40,022 వాహనాలను విక్రయించారు. అంటే ఇది దాదాపు 23 శాతం వృద్ధి చెందింది. అదే మొత్తంగా ఎగుమతులతో కలిపి చూసుకుంటే ఈ విభాగంలో 40,644 వాహనాలను విక్రయించారు.

ఎం అండ్ ఎం లిమిటెడ్, ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ, జూన్ చాలా ముఖ్యమైన నెల. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయి. త్వరలో మరిన్ని కొత్త మోడల్‌లను వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎస్‌యూవీ విభాగానికి దేశీయంగా పెరుగుతున్న ఆదరణ కారణంగానే మొత్తం అన్ని వాహన అమ్మకాలను పెంచడానికి సహాయపడింది. దేశంలో పండగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో అప్పటి వరకు కొత్త సాంకేతికతతో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు మోడళ్లను తీసుకొస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే అంతకుముందు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈఓ అనీష్ షా మాట్లాడుతూ, కంపెనీ తన ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్మ్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL) లిస్టింగ్ కోసం 2030 టైమ్‌ఫ్రేమ్‌ను పరిశీలిస్తోందని చెప్పారు.


Similar News