Tesla: టెస్లా తయారీ రేసులో పోటీ పడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు
ఈ విషయంపై టెస్లా తనకు అనుకూలమైన నిర్ణయమే తీసుకోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా భారత్‌లో తయారీని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం త్వరలో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే అప్పటి నుంచి టెస్లా పెట్టుబడి ప్రణాళికలు ముందుకు కదల్లేదు. తాజా పరిణామాల మధ్య టెస్లా తయారీ యూనిట్ కోసం కీలకమైన తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కానీ, ఈ విషయంపై టెస్లా తనకు అనుకూలమైన నిర్ణయమే తీసుకోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కంపెనీ స్థానిక భాగస్వామ్యం కోసం చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. టెల్సా ప్రధానంగా భారత మార్కెట్‌లోకి తక్కువ-ధర మోడల్‌తో ప్రవేశించాలని భావిస్తోంది. ఒకవేళ ఇదే వ్యూహమైతే మహారాష్ట్రలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తే గనక తమిళనాడుకు వెళ్లవచ్చు. ఇవి రెండూ కాకుండా లాజిస్టిక్స్ నష్టాలను భర్తీ చేస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి రాయితీల కోసం ప్రయత్నిస్తే మాత్రం గుజరాత్‌ను ఎంచుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే పూణెలో ఓ స్థానిక భాగస్వామితో పలు రౌండ్ల చర్చలు జరిపినట్టు సమాచారం. తక్కువ-ధర శ్రేణిలో(రూ. 18-25 లక్షల మధ్య) కార్లతో రావాలనుకుంటే ముంబై-ఢిల్లీ ఎన్‌సీఆర్‌ల మధ్య ఉన్న సులభ రవాణాను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర మొదటి ఎంపిక కావొచ్చు. కానీ ఎకోసిస్టమ్, ఓడరేవులు ఉన్న తమిళనాడులో ఏర్పాటు చేయడం వల్ల తయారీ, ఎగుమతులు వంటి అనేక ప్రయోజనాలు కంపెనీకి ఉన్నాయి. కాబట్టి మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలే టెస్లాకు మొదటి ప్రాధాన్యత కావొచ్చు.
ఒకవేళ పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చేందుకు గుజరాత్ సుముఖతగా ఉంటే గుజరాత్‌కు కూడా తరలించే అవకాశాలు లేకపోలేదు. దీనికి సంబంధించి కంపెనీ వర్గాలు స్పందించలేదు. కాగా, టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ గతేడాది మహారాష్ట్రలోని పూణెలో పంచశిల్ బిజినెస్ పార్క్‌లో ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకున్న సంగతి తెలిసిందే.