LIC: చిన్న సమూహాల కోసం ఎల్ఐసీ సరికొత్త ప్లాన్

ఆర్థిక సంస్థల డిమాండ్లతో పాటు సంస్థలకు అనుకూలంగా, సరసమైన ధరలో జీవిత బీమా అందించడానికి ఈ ప్లాన్‌ను రూపొందించారు.

Update: 2024-10-07 15:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు, కో-ఆపరేటివ్, స్వయం సహాయక బృందాలు సహా ఇతర ఆర్థిక సంస్థలు, ఎన్‌జీఓల డిమాండ్లను తీర్చేందుకు ఉద్దేశించి ప్రారంభించింది. సింగిల్ ప్రీమియం గ్రూప్ మైక్రో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌గా తీసుకొచ్చిన ఈ బీమా అక్టోబర్ 10వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆయా ఆర్థిక సంస్థల డిమాండ్లతో పాటు సంస్థలకు అనుకూలంగా, సరసమైన ధరలో జీవిత బీమా అందించడానికి ఈ ప్లాన్‌ను రూపొందించారు. ప్రధానంగా అసంఘటిత సమూహంలో ఉండే మెంబర్లు, యజమాని-ఉద్యోగి, ఒకే లక్ష్యంతో పనిచేసే గ్రూప్ సభ్యుల ప్రాథమిక బీమా అవసరాలను ఈ ప్లాన్ తీర్చనుంది. పాలసీదారు అనూహ్యంగా మరణిస్తే అప్పటికే ఉన్న రుణాలను తిరిగి చెల్లించే భారం వారి కుటుంబాలపై పడకుండా ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ ద్వారా 50 లేదా అంతకంటే ఎక్కువ సభ్యులతో కూడిన గ్రూప్‌లకు అందుబాటులో ఉంటుంది. సభ్యులకు రూ. 5,000 నుంచి రూ. 2 లక్షల వరకు రిస్క్ కవర్ సమ్ అష్యూర్డ్ ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రీమియంను ఒకే మొత్తం చెల్లించే వెసులుబాటు ఉంది. రిస్క్ కవర్ కోసం నెల నుంచి 10 ఏళ్ల మధ్య వ్యవధిని ఎంచుకోవచ్చు. 

Tags:    

Similar News