Kia India నుంచి సెకండ్ హ్యాండ్ కార్లు!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా ప్రీ-ఓన్‌డ్ వాహనాల వ్యాపారాన్ని ప్రారంభించినట్టు మంగళవారం ప్రకటించింది
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా ప్రీ-ఓన్‌డ్ వాహనాల వ్యాపారాన్ని ప్రారంభించినట్టు మంగళవారం ప్రకటించింది. 'కియా సీపీఓ' పేరుతో సర్టిఫైడ్ ప్రీ-ఓన్‌డ్ విభాగం ద్వారా కంపెనీ వినియోగదారులకు సేవలందిస్తుందని, ఈ ఏడాది చివరినాటికి 30 సేల్స్ ఔట్‌లెట్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.
కియా సీపీఓ ద్వారా వినియోగదారులు సెకండ్ హ్యాండ్ కార్ల యాజమాన్య బదిలీతో పాటు ఫైనాన్స్ సౌకర్యాలతో కూడిన క్రయవిక్రయాల సౌకర్యాలను పొందవచ్చని కియా ఇండియా వెల్లడించింది. సెకండ్ హ్యాండ్ వాహన మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా తాము వినియోగదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
ప్రస్తుతం ఈ విభాగంలో ప్రీ-ఓన్‌డ్ కార్లకు సంబంధించిన ధృకరణలు, సమాచారం విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని అధిగమించి ఖచ్చితమైన వివరాలతో వినియోగదారులకు వాహనాలను అందిస్తామని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్ అన్నారు.
కొత్త కియా కార్లను కలిగిన వినియోగదారుల్లో మూడో వంతు కస్టమర్లు వాటి రీప్లేస్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని గమనించాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ సర్టిఫైడ్ ప్రీ-ఓన్‌డ్ కార్ల వ్యాపారం ద్వారా వినియోగదారులకు సౌకర్యాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఏడాది చివరి నాటికి 30 ఔట్‌లెట్లను అందిస్తామని, ప్రస్తుతానికి హైదరాబాద్ సహా బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్ సహా మొత్తం 14 నగరాల్లో పదిహేను ఔట్‌లెట్లను ప్రారంభించామని కంపెనీ వెల్లడించింది.