Stock Market: తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

రోజంతా ఊగిసలాటకు గురైన సూచీలు ఆఖరులోనూ ప్రతికూల ప్రభావం కొనసాగడంతో ఫ్లాట్‌గా ముగిశాయి.

Update: 2024-10-01 13:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. గతవారం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిల్లో ర్యాలీ అయిన సూచీలు మంగళవారం రెండో సెషన్‌లో ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, దానివల్ల ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు జరిగినప్పటికీ రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ, బ్లూచిప్ స్టాక్‌లలో అమ్మకాలు వంటి అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేశాయి. రోజంతా ఊగిసలాటకు గురైన సూచీలు ఆఖరులోనూ ప్రతికూల ప్రభావం కొనసాగడంతో ఫ్లాట్‌గా ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 33.49 పాయింట్ల నష్టంతో 84,266 వద్ద, నిఫ్టీ 13.95 పాయింట్లు క్షీణించి 25,796 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, టాటా మోటార్స్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.83 వద్ద ఉంది. 

Tags:    

Similar News