IPO: డిసెంబర్ మూడో వారంలో నాలుగు ఐపీవోలు సందడి.. 11 కంపెనీలు లిస్టింగ్..!
దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Markets)లో వచ్చే వారం కూడా ఐపీఓల సందడి కొనసాగనుంది.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Markets)లో వచ్చే వారం కూడా ఐపీఓల సందడి కొనసాగనుంది. డిసెంబర్ మూడో వారంలో కొత్తగా 4 కంపెనీలు ఐపీవో సబ్ స్క్రిప్షన్(Subscription)కు రానున్నాయి. అయితే ఇందులో 2 కంపెనీలు మెయిన్ బోర్డు(Main Board) విభాగం నుంచి వస్తుండగా.. ఎస్ఎంఈ సెగ్మెంట్(SME Segment) నుంచి 2 కంపెనీలు రానున్నాయి. ఈ నాలుగు కంపెనీలు కలిపి సుమారు రూ.1,100 కోట్లను సమీకరించనున్నాయి. ఐపీఓ ద్వారా పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ విభాగానికి చెందిన ట్రాన్సరైల్ లైటింగ్(Transrail lighting) అత్యధికంగా రూ. 892 కోట్లను సమీకరించనుండగా.. మమత మెషినరీ(Mamta Machinery) రూ. 179.39 కోట్లను సమీకరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి రానున్న ఐడెంటికల్ బ్రెయిన్స్ స్టూడియోస్, NACDAC ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు కలిపి ఐపీవో ద్వారా రూ. 30 కోట్లను సమీకరించనున్నాయి. ఇక వచ్చే వారం 11 కంపెనీలు మార్కెట్ లో లిస్ట్ కానున్నాయి. వీటిలో విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ లాంటి ప్రధాన కంపెనీలు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 18న స్టాక్ ఎక్స్చేంజిలో నమోదు కానున్నాయి.