జర్మనీలో మాంద్యంతో భారత ఎగుమతులపై ప్రభావం!
జర్మనీ ఆర్థిక వ్యవస్థ వరుస రెండు త్రైమాసికాల్లో కృంగిపోయి సాంకేతిక మాంద్యంలోకి జారుకుంది
న్యూఢిల్లీ: జర్మనీ ఆర్థిక వ్యవస్థ వరుస రెండు త్రైమాసికాల్లో కృంగిపోయి సాంకేతిక మాంద్యంలోకి జారుకుంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి దుస్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల రంగాల నుంచి భారత ఎగుమతులు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇతర దేశాలు ఇప్పటికే ప్రతికూల వృద్ధి ఎదుర్కొంటున్న కారణంగా అతిపెద్ద ఆర్థికవ్యవస్థ జర్మనీ మాత్రమే కాకుండా మొత్తం యూరప్‌కు భారత ఎగుమతులు దెబ్బతింటాయని ప్రముఖ ఎగుమతి సంస్థ టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ చెప్పారు.
2022-23 లో జర్మనీకి భారత్ నుంచి సుమారు రూ. 84.22 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ప్రస్తుత మాంద్యం కారణంగా గణనీయంగా పతనం కావొచ్చు. ముఖ్యంగా తోలు ఉత్పత్తులు, రసాయన, తేలికపాటి ఇంజనీరింగ్ వస్తువుల రంగాలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని శరద్ కుమార్ పేర్కొన్నారు. మాంద్యం ప్రభావం వల్ల భారత్‌కు చెందిన రూ. 16,515 వేల కోట్ల విలువైన ఎగుమతులు దెబ్బతింటాయని ఎకనామిక్ థింక్-ట్యాంక్ జీటీఆర్ఐ సహ-వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
మరికొద్ది రోజుల్లో జర్మనీ విధించబోయే కార్బన్ బోర్డర్ ట్యాక్స్ కారణంగా ఇనుము, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతులు కూడా పడిపోవచ్చని ఆయన తెలిపారు. జర్మనీలో మాంద్యం దేశీయ కంపెనీల ఆర్డర్లపై ప్రభావం చూపుతుందని ఎగుమతుల సమాఖ్య ఏఈపీసీ ఛైర్మన్ నరేంద్ర గోయెంకా పేర్కొన్నారు. కనీసం 10 శాతం ఎగుమతులు క్షీణిస్తాయన్నారు.