PSBs: రూ. 1.40 లక్షల కోట్లు దాటిన ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు
సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల జీఎన్‌పీఏ నిష్పత్తి గణనీయంగా పడిపోయిందని మంత్రిత్వ శాఖ తెలీపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధికంగా రూ. 1.41 లక్షల కోట్ల నికర లాభాలను నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు స్థూల నిరర్ధక ఆస్తులు(జీఎన్‌పీఏ)నిష్పత్తి గణనీయంగా పడిపోయిందని మంత్రిత్వ శాఖ తెలీపింది. 2024, సెప్టెంబర్ నాటికి నిరర్ధక ఆస్తులు 3.12 శాతానికి క్షీణించాయి. పీఎస్‌బీల మెరుగైన పనితీరు కారణంగా గడిచిన మూడేళ్లలో రూ. 61,964 కోట్ల డివిడెండ్‌ను చెల్లించి, షేర్‌హోల్డింగ్ రిటర్న్‌కు గణనీయంగా దోహదపడ్డాయి. ప్రధానంగా కార్యకలాపాల సామర్థ్యం, మెరుగైన ఆస్తుల నాణ్యత, బలమైన మూలధన నిల్వల దారానే బ్యాంకుల లాభాలు పెరిగాయి. ఇది మొత్తం దేశా ఆర్థిక వృద్ధికి మద్దతిస్తుందని, దేశ ఆర్థిక వృద్ధి పెరగడంలో కీలక పాత్ర పోషించాయని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. బ్యాంకులు అందించిన మెరుగైన డివిడెండ్ ద్వారా కేంద్రం అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనా వంటి కీలక పథకాలను తీసుకొచ్చింది. వీటి ప్రయోజనాలు సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చేరేలా చేశాయి. సంస్కరణలు, సంక్షేమ చర్యలు, బలమైన విధానాలతో భారత ప్రభుత్వం ఈ రంగానికి చురుగ్గా మద్దతునిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.