FPIs: మళ్లీ పెరిగిన విదేశీ ఈక్విటీ పెట్టుబడులు.. 2 వారాల్లో రూ. 22 వేల కోట్లు
డిసెంబర్ దేశీయ ఆర్థిక అవకాశాలపై పెరిగిన నమ్మకంతో ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు.
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో తిరిగి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. ఈ నెల మొదటి రెండు వారాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 22,766 కోట్ల నిధులను భారతీయ ఈక్విటీలలో ఉంచారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు రికార్డు స్థాయిలో రూ. 94 వేల కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకోగా, నవంబర్‌లో భారీగా 21,612 కోట్లు మాత్రమే వెనక్కి తీసుకున్నారు. అయితే, డిసెంబర్ దేశీయ ఆర్థిక అవకాశాలపై పెరిగిన నమ్మకంతో ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. రానున్న రోజుల్లో కూడా భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు వివిధ కీలక అంశాలపై ఆధారపడి కొనసాగుతాయని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడంతో విధానాల్లో మార్పులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అంశాలు ఈక్విటీలపై సానుకూల పరిణామంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. వీటితో పాటు దేశీయంగా కంపెనీల త్రైమాసిక ఫలితాలు కలిసి రానున్నాయని పేర్కొన్నారు.