2030 నాటికి రూ.9 లక్షల కోట్లకు భారత సెమీకండక్టర్ల మార్కెట్: బోస్టన్-మ్యాట్రిక్స్
వచ్చే దశాబ్దంలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత్ లక్ష్యం సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఈవీ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలకు ఆజ్యం పోస్తుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, మ్యాట్రిక్స్ నివేదిక తెలిపింది
దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే దశాబ్దంలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత్ లక్ష్యం సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఈవీ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలకు ఆజ్యం పోస్తుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, మ్యాట్రిక్స్ నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్స్ మార్కెట్ విలువ సుమారు $500 బిలియన్లు(రూ.41 లక్షల కోట్లు) కాగా, దీనిలో సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి $120 బిలియన్లు(రూ.9 లక్షల కోట్లకు)గా అవతరిస్తుందని నివేదిక అంచనా వేసింది.
గత కొన్నేళ్లుగా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూల విధానాలు అందిస్తుండటంతో దేశీయంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఫాక్స్‌కాన్, డెల్, శామ్‌సంగ్, మైక్రొన్ వంటివి తమ యూనిట్లను భారత్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. తక్కువ ధర నిర్మాణం కారణంగా భారత్‌లో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, మైక్రోకంట్రోలర్‌లను నిర్మించడానికి అపారమైన డిజైన్ అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.
సెమీకండక్టర్ల కోసం పూర్తి అనుకూల పర్యావరణ వ్యవస్థ ప్రస్తుతం భారత్‌లో ఉండటంతో స్థానికంగా తయారీ, అసెంబ్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయని నివేదిక పేర్కొంది. అలాగే, ఫేమ్ పథకం ద్వారా 2030 నాటికి సంవత్సరానికి 14 మిలియన్ యూనిట్ల ఈవీ అమ్మకాలు జరుగుతాయని నివేదిక అంచనా వేసింది.