ఈ మార్చిలోగా రూ. 82 వేల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశీయంగా తయారైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 10 బిలియన్ డాలర్ల(రూ. 82 వేల కోట్లకు పైగా) మార్కును అధిగమిస్తాయని పరిశ్రమల సంఘం తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశీయంగా తయారైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 10 బిలియన్ డాలర్ల(రూ. 82 వేల కోట్లకు పైగా) మార్కును అధిగమిస్తాయని పరిశ్రమల సంఘం తెలిపింది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) బుధవారం వెల్లడించిన దాని ప్రకారం, కేంద్రం స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయాల ద్వారా ఇది సాధ్యమైంది.
ప్రధానంగా మొత్తం ఎగుమతుల్లో యాపిల్ మేక్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 50 శాతంగా ఉండటం విశేషం. దీని తర్వాత శాంసంగ్ 40 శాతం మొబైల్ ఎగుమతులతో రెండో స్థానంలోనూ, ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 10 శాతం ఎగుమతుల వాటాను కలిగి ఉన్నాయి. భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ద్వారా ఇది సాధ్యమవుతోందని ఐసీఈఏ తెలిపింది.
మొత్తం ఎగుమతుల్లో అత్యధికంగా యూఏఈ, యూఎస్, నెదర్లాండ్స్, యూకే, ఇటలీలకు వెళ్తున్నాయని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహిద్రు చెప్పారు. పరిశ్రమలో మొబైల్‌ఫోన్ తయారీ సామర్థ్యం 40 బిలియన్ డాలర్ల(రూ. 3.06 లక్షల కోట్లను దాటనుండగా, మరో 25 శాతం అంటే 10 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్‌ఫోన్‌లు ఎగుమతి కానున్నాయని ఆయన పేర్కొన్నారు.