2028 నాటికి రూ.7.76 ట్రిలియన్లకు భారత ఆహార సేవల రంగం
భారతదేశంలో ఆహార సేవల పరిశ్రమ విలువ రూ.5.69 ట్రిలియన్ల నుంచి 2028 నాటికి రూ.7.76 ట్రిలియన్లకు చేరుకుంటుందని ఇండియా ఫుడ్ సర్వీసెస్ రిపోర్ట్(2024) వెల్లడించింది
దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో ఆహార సేవల పరిశ్రమ విలువ రూ.5.69 ట్రిలియన్ల నుంచి 2028 నాటికి రూ.7.76 ట్రిలియన్లకు చేరుకుంటుందని ఇండియా ఫుడ్ సర్వీసెస్ రిపోర్ట్(2024) వెల్లడించింది. వేగంగా విస్తరిస్తున్న మార్కెట్ అవకాశాలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ పరిశ్రమ దాదాపు ఏడాది ప్రాతిపదికన 8.1 శాతం వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పెరుగుతున్న ఆదాయ స్థాయిలు వినియోగదారుల ప్రవర్తనలో మార్పుకు దారితీశాయి. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆహార సేవల పరిశ్రమ క్రమంగా ఇప్పుడు కోలుకుంటుంది. 2024లో, రిటైల్, ఇన్సూరెన్స్ తర్వాత రూ. 5.7 ట్రిలియన్‌లతో ఈ రంగం భారతదేశంలో మూడవ అతిపెద్ద పరిశ్రమగా అవతరించింది. దేశంలో ఉపాధి పరంగా ఇది రెండవ అతిపెద్దదని, వివిధ పాత్రలు, నైపుణ్య స్థాయిలలో ఉపాధి అవకాశాలను అందించడంలో ఇది ప్రముఖంగా ఉందని నివేదిక తెలిపింది.
2024లో, పరిశ్రమ 85.5 లక్షల మంది వ్యక్తులకు ఉపాధి కల్పించగా, 2028 నాటికి ఈ సంఖ్య ఒక కోటికి పైగా పెరుగుతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆహార సేవల పరిశ్రమ వృద్ధి 8 శాతంగా ఉంటుందని ఇండియా ఫుడ్ సర్వీసెస్ పేర్కొంది. ఇదే సమయంలో డెలివరీ మార్కెట్ కూడా దాదాపు 22 శాతం వద్ద బలంగా పెరుగుతోందని నివేదిక అంచనా వేసింది.