ఆరేళ్లలో రూ. 1.66 లక్షల కోట్లకు ఎంటర్‌ప్రైజ్ ఫిన్‌టెక్ పరిశ్రమ
తక్కువ ఖర్చులు, వృద్ధి, ఇన్నోవేషన్, డిమాండ్ నేపథ్యంలో ఎంటర్‌ప్రైజ్ ఫిన్‌టెక్ పరిశ్రమ 2030 నాటికి పెరుగుతుందని అంచనా
దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో తక్కువ ఖర్చులు, వృద్ధి, ఇన్నోవేషన్, డిమాండ్ ఉన్న నేపథ్యంలో దేశీయ ఎంటర్‌ప్రైజ్ ఫిన్‌టెక్ పరిశ్రమ 2030 నాటికి సుమారు రూ. 1.66 లక్షల కోట్లకు పెరుగుతుందని ఓ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ రూ. 22.45 వేల కోట్లుగా మాత్రమే ఉంటుందని అంచనా. చిరాటే వెంచర్స్ 'అన్‌లాకింగ్ ఇండియన్ ఎంటర్‌ప్రైజ్ ఫిన్‌టెక్ ' పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, కొత్త సాంకేతికత సహకారంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రిటైల్, ఎంఎస్ఎంఈ విభాగాలు 100 శాతం డిజిటలీకరణ దిశగా పయనిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎంటర్‌ప్రైజ్ ఫిన్‌టెక్ స్టార్టప్‌లు రాబోయే దశాబ్దాల్లో పెరుగుతున్న డిజిటల్ వినియోగాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోనున్నాయి. బీఎఫ్ఎస్ఐ విభాగంలో కీలకమైన బ్యాంకింగ్ టెక్, లెండింగ్ టెక్, పేటెక్, ఇన్సూర్‌టెక్, వెల్త్‌టెక్ వంటి విభాగాల్లో సామర్థ్యం వేగంగా పెరుగుతోంది. కొత్త ఉత్పత్తులు, అమ్మకాలు, సేవలతో ఎంటర్‌ప్రైజ్ ఫిన్‌టెక్‌లకు గిరాకీ అధికంగా ఉండనుందని నివేదిక తెలిపింది. భవిష్యత్తులో ఆర్థిక రంగంలో టెక్నాలజీపై పెట్టుబడులు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే ఇండియా స్టాక్, ఓఎన్‌డీసీ వంటి పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయి. ఇటీవల డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ మెరుగైన డేటా గవర్నెన్స్‌కు మద్దతిస్తుందని ఫిన్‌టెక్, డిజిటల్ ఫైనాన్స్ కన్సల్టింగ్ సంస్థ డిజిటల్ ఫిఫ్త్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు సమీర్ సింగ్ జైని వివరించారు.