ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ప్రకటనల రంగం!
ప్రస్తుత ఏడాదిలో భారత ప్రకటనల వ్యయం 15.5 శాతం వృద్ధి చెంది రూ. 1.46 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ నివేదిక అంచనా వేసింది.
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదిలో భారత ప్రకటనల వ్యయం 15.5 శాతం వృద్ధి చెంది రూ. 1.46 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ నివేదిక అంచనా వేసింది. ప్రముఖ మీడియా ఏజెన్సీ గ్రూప్ ఎమ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత ఏడాది రెండంకెల వృద్ధి కారణంగా గత ఏడాది తొమ్మిదో స్థానంలో ఉన్న దేశీయ ప్రకటనల వ్యయం ఈ ఏడాది ఎనిమిదో స్థానానికి చేరుకోనుంది.
ప్రధానంగా టెలికాం, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ట్రావెల్, టూరిజం ఈ ఏడాది ప్రకటనల వృద్ధికి దోహదపడే కీలక రంగాలుగా ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రకటనల పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని గ్రూప్ఎమ్‌కు చెందిన అశ్విన్ పద్మనాభన్ అన్నారు. ఈ ఏడాదిలో ప్రకటనల ఖర్చులో 56 శాతం డిజిటల్ విభాగంలో ఉంటుందని నివేదిక తెలిపింది.
ఇది గత ఏడాది కంటే 20 శాతం ఎక్కువగా, ఇది మొత్త పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. 2021 నుంచి ఇప్పటివరకు డిజిటల్ ప్రకటనల ఖర్చులు 50 శాతానికి పైగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఈ విభాగంలో యాడ్స్ గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత టీవీ యాడ్స్ 30 శాతం, ప్రింట్ విభాగంలో 10 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది.