మరో నాలుగేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థికవ్యవస్థ
2027-28 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు పైగా జీడీపీతో దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2027-28 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు పైగా జీడీపీతో దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. అంచనాల ప్రకారం, 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 30 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 'గుజరాత్ వైబ్రెంట్ సమ్మిట్' కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి, ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత 3.4 ట్రిలియన్ డాలర్లతో ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉందన్నారు. ఈ ఏడాది దేశ జీడీపీ 7.3 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే, గతేడాది దేశంలో 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అందులో 65 శాతానికి పైగా గడిచిన తొమ్మిదేళ్లలో ప్రధాని మోడీ సారథ్యంలోనే వచ్చాయని వెల్లడించారు. ఇదే సమయంలో, 2014 నాటికి 15 కోట్ల మంది ప్రజలకు మాత్రమే బ్యాంకు అకౌంట్లు ఉండగా, ప్రస్తుతం ఇది 50 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.