ఎల్ఐసీ సీఈఓ నియామకంపై ప్రభుత్వం కసరత్తు!

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి పెట్టుబడిదారులను నిరుత్సాహపరిచింది.

Update: 2022-12-08 12:21 GMT

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి పెట్టుబడిదారులను నిరుత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో సంస్థను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఎల్ఐసీ సీఈఓగా ప్రైవేట్ రంగ నిపుణులను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో సుమారు రూ. 41 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కలిగిన ఎల్ఐసీ సంస్థకు, అది ఏర్పాటైన 66 ఏళ్ల చరిత్రలో తొలిసారి ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తి నాయకత్వం వహించనున్నారు.

ఎల్ఐసీ సీఈఓ నియామకానికి అర్హత ప్రమాణాలను మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రైవేట్ రంగ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఎల్ఐసీ ఛైర్మన్ ఎం ఆర్ కుమార్ నాయకత్వంలో కొనసాగుతోంది. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చికి ముగుస్తుంది. దీంతో ఛైర్మన్ పదవిని రద్దు చేసి, ప్రైవేట్ రంగం నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ని ప్రభుత్వం నియమిస్తుందని అధికారులు పేర్కొన్నారు. దీనికోసం గతేడాదే ప్రభుత్వం ఎల్ఐసీ చట్టంలో మార్పులు చేసింది.

ఈ నిర్ణయం ప్రైవేట్ రంగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేలా ఎల్‌ఐసీ సీఈవో నియామకానికి అర్హత ప్రమాణాలను విస్తృతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, వాటాదారులకు సానుకూల సంకేతాలు లభిస్తాయని ప్రభుత్వాధికారులు చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించలేదు. కాగా, ఈ ఏడాది మేలో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన ఎల్ఐసీ సంస్థ షేర్ ధర ఇప్పటివరకు 30 శాతం మేర క్షీణించింది. ప్రస్తుతం రూ. 661.05 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి:

కార్లకు 3 ఏళ్లు, బైక్‌లకు ఐదేళ్ల పాటు బీమా.. ప్రతిపాదించిన IRDAI ! 


Similar News