పెట్టుబడులను ప్రోత్సహించడంపై భారత్- దక్షిణ కొరియా చర్చలు

ఇప్పటికే ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాలపై భారత్-దక్షిణ కొరియా శనివారం చర్చలు జరిపాయి

Update: 2024-09-21 08:33 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాలపై భారత్-దక్షిణ కొరియా శనివారం చర్చలు జరిపాయి. లావోస్‌లోని వియంటియాన్‌లో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, దక్షిణ కొరియా మంత్రి ఇంక్యో చియోంగ్ సమావేశమై రెండు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (సీఈపీఏ) అప్‌గ్రేడ్ చేయడం, ఉద్యోగాల కల్పనతో ముడిపడి ఉన్న పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, వివిధ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న సుంకాలను పరిష్కరించడం వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

జనవరి 2010లో అమలులోకి వచ్చిన సీఈపీఏను మరింత ముందుకు తీసుకెళ్లడానికి రెండు దేశాలు ఇప్పటివరకు 10 రౌండ్లకు పైగా సమీక్ష చర్చలు జరిగాయి. ముఖ్యంగా శనివారం జరిగిన చర్చల్లో భారత్, దక్షిణ కొరియా కంపెనీలు భారతీయ స్టీల్‌ను కొనుగోలు చేయకపోవడంపై అసంతృప్తిని తెలియజేసింది. అలాగే రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య లోటుపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశ నుంచి దక్షిణ కొరియాకు ఎగుమతులు 2021-22లో $8 బిలియన్ల నుండి 2022-23లో $6.65 బిలియన్లకు తరువాత 2023-24లో $6.41 బిలియన్లకు తగ్గాయి. అదే సమయంలో అక్కడి నుంచి దిగుమతులు 2021-22లో $17.5 బిలియన్లు, 2022-23లో $21.22 బిలియన్లు, 2023-24లో 21.13 బిలియన్లుగా ఉన్నాయి.


Similar News