మాంద్యం పరిస్థితుల మధ్య పని చేసేందుకు భారత్ అనువైన ప్రదేశం: ఇన్ఫోసిస్ కో-ఫౌండర్!
అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పని చేసేందుకు భారత్ అనువైన ప్రదేశమని టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అన్నారు.
బెంగళూరు: అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పని చేసేందుకు భారత్ అనువైన ప్రదేశమని టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రపంచం తీవ్రమైన మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. అయితే, భారత్‌లో ఐటీ పరిశ్రమ రెండంకెల వృద్ధిని సాధించవచ్చు. ఈ ఏడాది కూడా దాదాపు 12 శాతం ఉండవచ్చు. ప్రస్తుత ఏడాదిలోనే 2-3 లక్షల మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తీసుకుంటాయి. ఆర్‌బీఐ కూడా దేశ వృద్ధి రేటును 6.3 శాతంగా అంచనా వేస్తోంది.
ఇది ఇతర దేశాల కంటే మెరుగని ఆయన వివరించారు. ఇదే సమయంలో మెటా, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు పై స్పందించిన గోపాలకృష్ణన్, కొన్ని బడా టెక్ సంస్థల వైఫల్యం వల్ల భారతీయులు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. కానీ, ఈ సంఖ్య తక్కువగానే ఉందని, ఈ ధోరణి కొత్తగా ఉద్యోగాల కోసం చూసే యువత అవకాశాలను దెబ్బతీయదని తెలిపారు. ఇటీవల వాహన పరిశ్రమ తో పాటు హెల్త్, ఈ-కామర్స్ రంగాలు టెక్ సాయంతో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన వెల్లడించారు.