2047 నాటికి ఉన్నత-మధ్య-ఆదాయ దేశంగా భారత్!
రాబోయే 25 ఏళ్లలో భారత్ 7-7.5 శాతం స్థిరమైన వృద్ధి రేటును సాధించగలిగితే 2047 నాటికి ఉన్నత-మధ్య-ఆదాయ దేశంగా అవతరించగలదని ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రాయ్ ఓ ప్రకటనలో తెలిపారు.
న్యూఢిల్లీ: రాబోయే 25 ఏళ్లలో భారత్ 7-7.5 శాతం స్థిరమైన వృద్ధి రేటును సాధించగలిగితే 2047 నాటికి ఉన్నత-మధ్య-ఆదాయ దేశంగా అవతరించగలదని ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్‌గా ఉన్న ఆయన, ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో, భారత్ ఏటా 7-7.5 శాతం వృద్ధి కొనసాగించగలిగితే 2047 నాటికి 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారుతుందన్నారు. ప్రస్తుతానికి 2.7 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది.
అనుకున్న వృద్ధి రేటు నమోదైతే 2047 నాటికి భారత్ తలసరి ఆదాయం సుమారు రూ. 8 లక్షలకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. నిర్దేశంచిన సమయానికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, ఇది సాధ్యమైతే భారత్ ఎగువ మధ్య ఆదాయ వర్గంగా ఉంటుంది. మంగళవారం ఓ కార్యక్రమంలో బిబేక్ దేబ్రాయ్ 'ది కాంపిటీటివ్‌నెస్ రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియా@100' నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం, భారత్ అనేక రంగాల్లో బలమైన వృద్ధిని సాధిస్తున్నప్పటికీ, దేశంలో గణనీయమైన పేదరికం కొనసాగుతోంది. భారత జనాభాలో దాదాపు 20 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది.