సైబర్ దాడులకు లక్ష్యంగా మారిన భారతీయ కంపెనీలు!

గత కొంతకాలంగా భారత్‌కు చెందిన కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రంగ, సేవల రంగాల్లోని సంస్థలు సైబర్ దాడులను ఎదుర్కొంటున్నాయి.

Update: 2023-09-11 10:44 GMT

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా భారత్‌కు చెందిన కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రంగ, సేవల రంగాల్లోని సంస్థలు సైబర్ దాడులను ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ తాజా సర్వే ప్రకారం.. 67 శాతం భారత ప్రభుత్వ, సేవల సంస్థల్లో సైబర్ దాడులు 50 శాతానికి పైగా పెరిగాయి. రవాణా, తయారీ, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కొత్తరకం సైబర్ దాడులకు ప్రభావితం అయ్యాయి. డిజిటల్ పరివర్తనకు మారుతున్న క్రమంలో భారత్ సైబర్ భద్రతకు సంబంధించి ఈ ప్రాథమిక సవాలును అధిగమించడం కీలకమని పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఇండియా ఎండీ, వైస్-ప్రెసిడెంట్ అనిల్ వల్లూరి అన్నారు.

ముఖ్యంగా తయారీ, లాజిస్టిక్స్, బీఎఫ్ఎస్ఐ రంగాలు సైబర్ అటాక్‌లను ఎదుర్కొంటున్నాయి. వాటిలో 66 శాతం దేశీయ తయారీ సంస్థలు ఇతర రంగాల కంటే అంత సురక్షితం కానీ ఐఓటీ పరికరాల కారణంగా ఈ సమస్యను చూస్తున్నాయి. 83 శాతం రవాణా, లాజిస్టిక్ కంపెనీలు సైబర్ దాడులు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. ఈ సైబర్ దాడుల కారణంగా వ్యాపారాల నిర్వహణలో తీవ్ర అంతరాయాన్ని చూస్తున్నట్టు 34 శాతం దేశీయ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు వెల్లడించాయి. కంపెనీలు క్లౌడ్ ఆధారిత సేవలు, యాప్‌లపై ఎక్కువ ఆధారపడటం ఈ కొత్త సమస్యకు ప్రధాన కారణమని పాలో ఆల్టో నెట్‌వర్క్స్ నివేదిక పేర్కొంది.


Similar News