Fixed Deposits: ఆకట్టుకుంటున్న ఫిక్స్‌డ్ ​డిపాజిట్లు.. ప్రజలకు రిస్క్​లేకుండా వడ్డీ రాబడి

Update: 2024-08-23 07:21 GMT

గతంలో కంటే పెట్టుబడులకు అవకాశాలు పెరగడంతో చాలామంది ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన సాధనాల కంటే ఎక్కువ ఆదరణ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ) స్థిరమైన రాబడికి, తక్కువ రిస్క్‌కు సరైన ఎంపికగా మారుతున్నాయి. ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును దాచుకునేందుకు, స్థిరమైన రిటర్న్స్​కావాలనుకునే వారికి ఎఫ్‌డీలో వడ్డీ స్థిరంగా అందుతుంది. ఎంచుకున్న కాలాన్ని బట్టి దానిపై నిర్దేశించిన వడ్డీ పొందవచ్చు. ఇందులో డిపాజిట్ భద్రంగా ఉండటంవల్ల ఎక్కువగా రిస్క్ చేయడం ఇష్టంలేని వారు, సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీలను ఎంపిక చేస్తారు. రాబడి విషయంలో మిగిలిన పెట్టుబడి సాధనాల కంటే తక్కువే అయినప్పటికీ రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడనివారు ఎఫ్‌డీల వైపు చూస్తున్నారు. ఎఫ్‌డీల్లో స్వల్పకాలానికి అంటే 1-3 ఏళ్ల మధ్య, మధ్యకాలిక(3-5 ఏళ్లు), దీర్ఘకాలం(5-10 ఏళ్లు) కాలవ్యవధుల్లో సొమ్మును ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీల గురించి, వాటిలో రకాలు, వడ్డీ వివరాలు.. సొమ్ము పెట్టాక ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి.. అవేమిటో తెలుసుకుందాం. - సత్యగోపి

రేటింగ్​ఉన్న బ్యాంకు బెటర్..

ఎఫ్‌డీల్లో మన సొమ్ము ఉంచాలంటే మొదటగా ఏ బ్యాంకు మంచిదనేది ఎంచుకోవాలి. భవిష్యత్తు కోసం డబ్బు మదుపు చేసేముందు విశ్వాసం కలిగిన బ్యాంకులను ఎంపిక చేసుకోవడం ముఖ్యమని నిపుణులు సలహాలిస్తున్నారు. అన్ని బ్యాంకుల్లోనూ ఇంచుమించు ఒకే రకమైన వడ్డీ ఉంటుంది కదా అని చూడకూడదు. మంచి పేరున్న బ్యాంకు కోసం కొంత పరిశోధన అవసరం. ముఖ్యంగా కేర్, క్రిసిల్ లాంటి రేటింగ్ సంస్థలు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే రేటింగ్‌ని బట్టి వాటిని ఎంపిక చేయవచ్చు. ఉదాహరణకు ‘ఏఏఏ’ వంటి రేటింగ్ ఉన్న బ్యాంకులైతే చాలా తక్కువ రిస్క్ ఉంటుందనే విషయాన్ని గమనించాలి.

వడ్డీ రేట్ల పోలిక..

ఆ తర్వాత ఏయే బ్యాంకులు ఎంతవరకు వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయో పరిశీలించాలి. ఎక్కువ వడ్డీ ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు, బ్యాంక్ స్థిరత్వాన్ని రిస్క్ ఉంటుందని గుర్తించుకోవాలి. ఎఫ్‌డీలలో మదుపు చేసేందుకు రెండు పద్ధతులు ఉంటాయి. అవి కాలబుల్, నాన్-కాలబుల్. అంటే ఎఫ్‌డీలో సొమ్ము పెట్టడానికి ముందే మధ్యలో తీయాలా? లేదా చివరి వరకు ఉంచాలా? అనేది నిర్ణయించుకోవాలి.

కాలబుల్: ఈ పద్ధతిలో ఎవరైనా సరే ఎఫ్‌డీలో మదుపు చేసిన తర్వాత మెచ్యూరిటీ సమయం కంటే ముందు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ ఎంచుకోవడం. మధ్యలో విత్‌డ్రా కోసం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

నాన్-కాలబుల్: కొంత మొత్తాన్ని ఎఫ్‌డీలో ఉంచిన తర్వాత లాక్-పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయం కంటే ముందు విత్‌డ్రా అవకాశం ఉండదు.

కాలవ్యవధి

ఫిక్స్‌డ్​డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే సొమ్ముపై వడ్డీ రేట్లు వివిధ కాలవ్యవధులను బట్టి మారుతాయి. చాలావరకు తక్కువ కాలంపాటు మదుపు చేసే డిపాజిట్లపై కంటే ఎక్కువ కాలానికి చేసే మొత్తాలపై అధిక వడ్డీని బ్యాంకులు ఇస్తుంటాయి. దాదాపు అన్ని బ్యాంకులు ఇదే పద్ధతిని అనుసరిస్తాయి. అయితే, కొన్ని బ్యాంకులు వాటి బ్యాలెన్స్ షీట్ ఆధారంగా దీర్ఘకాలం కంటే మధ్యకాల ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ ఇస్తామని వినియోగదారులకు ఆఫర్ చేస్తాయి. మరికొన్ని బ్యాంకులు దీర్ఘకాలానికే అధిక వడ్డీ ఇవ్వడానికి సిద్ధపడతాయి. కాబట్టి ఎఫ్‌డీల్లో మదుపు చేయడానికి ముందు ఏయే బ్యాంకులు, ఏయే కాలపరిమితులపై ఎంత వడ్డీని ఇస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది.

ఎఫ్‌డీలు.. రకాలు

స్టాండర్డ్ ఎఫ్‌డీ: ఈ ఎఫ్‌డీని దేశవ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. ముందుగా ఎంతకాలానికి అనే విషయాన్ని ఎంచుకుని మదుపు చేయాల్సి ఉంటుంది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చు. నిర్ణయించిన కాలవ్యవధి కంటే ముందుగా ఎఫ్‌డీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే పెనాల్టీ ఉంటుంది. ఈ ఎఫ్‌డీ మొత్తంపై లోన్ తీసుకునే వీలుంటుంది.

ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ: ఈ ఎఫ్‌డీల్లో ఐదేళ్ల కంటే తక్కువ కాలానికి మదుపు చేయలేం. ఈ ఎఫ్‌డీపై ఐదేళ్లకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ట్యాక్స్​సేవింగ్ ఎఫ్‌డీలో చేసే మొత్తంపై సెక్షన్ 80సీ కింద ఏటా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ వడ్డీ మొత్తంపై పన్ను విధిస్తారు. ఈ ఎఫ్‌డీలో ఒకేసారి మొత్తం సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

స్పెషల్ ఎఫ్‌డీ: ఈ ఎఫ్‌డీ బ్యాంకులను బట్టి నిర్దేశిత కాలానికి ఉంటుంది. అవి 299 రోజులు, 375 రోజులు, 444, 666 రోజులు ఇలా ఉంటాయి. వీటిపై ఇతర ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీని బ్యాంకులు ఆఫర్ చేస్తాయి. ఈ ఎఫ్‌డీలో బ్యాంకులు నిర్ణయించిన కాలవ్యవధి వరకు సొమ్మును ఉంచాలి.

సీనియర్ సిటిజన్: ఇది సీనియర్ సిటిజన్‌లకు మాత్రమే వర్తించే ఎఫ్‌డీ రకం. సాధారణ ఖాతాదారుల కంటే దాదాపు 0.25 శాతం నుంచి 1 శాతం వరకు అధిక వడ్డీని బ్యాంకులు ఇస్తాయి.

ఫ్లెక్సీ ఎఫ్‌డీ: ఇది సేవింగ్స్ ఖాతాకు, ఎఫ్‌డీ ఖాతాకు అనుసంధానం చేసి ఉంటుంది. కొంత మొత్తంతో ఎఫ్‌డీని ప్రారంభించిన తర్వాత సేవింగ్స్ అకౌంట్‌లో ఎంచుకున్న పరిమితి కంటే ఎక్కువ నగదు ఉంటే ఎఫ్‌డీ ఖాతాకు బదిలీ అవుతుంది. అవసరమైనప్పుడు దాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఎఫ్‌డీలో సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

కార్పొరేట్ ఎఫ్‌డీ: ఏవైనా సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వద్ద డిపాజిట్ చేసే వాటిని కార్పొరేట్ ఎఫ్‌డీ అంటారు. ఈ ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ వస్తుంది. అయితే, ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి వాటిలో 'ఏఏఏ' రేటింగ్ ఉన్నవాటిలోనే చేయడం మెరుగైన ఎంపిక.

వడ్డీ రేటు-రకాలు..

ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేసే సొమ్ముపై వడ్డీ రేట్లు వివిధ రకాలుగా ఉంటాయి. మొదటి క్యుములేటివ్ విధానంలో పెట్టుబడి మొత్తాన్ని మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు లాక్ చేస్తారు. కాలవ్యవధి అయ్యే వరకు ఉన్న తర్వాత ఇన్వెస్ట్ చేసిన అసలు, వడ్డీని కలిపి ఇస్తారు. నాన్-క్యుములేటివ్ పద్దతిలో ప్రతి నెలా లేదంటే త్రైమాసికానికి, అర్ద సంవత్సరం లేదా ఏడాదికి ఒకసారి వడ్డీ ఆదాయం పొందవచ్చు. ఇది ఎవరి అవసరాలకు తగినట్టుగా వారు ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ అవసరమైతే డిపాజిట్‌ను నిలిపేసి పెట్టుబడి మొత్తాన్ని తీసుకోవచ్చు.

ఎఫ్‌డీలపై లోన్..

ఏదైనా అత్యవసరానికి బ్యాంకులో రుణం తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోవడం, ఇతర వివరాలు అందజేయడం లాంటి ప్రక్రియ ఉంటుంది. కానీ, ఎఫ్‌డీలు కట్టేవారు సులభతంగా ఆటోమెటిక్‌గా లోన్ తీసుకునేందుకు వీలవుతుంది. అదెలాగంటే.. మదుపు చేసిన ఎఫ్‌డీ మొత్తంలోని 75 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే, ఇలా ఎఫ్‌డీలపై లోన్ తీసుకోవడం వల్ల బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే 2 శాతం మేర అదనంగా వడ్డీని విధిస్తాయి. ఉదాహరణకు.. 10 ఏళ్ల కాలానికి ఎఫ్‌డీ తీసుకుని, నాలుగేళ్ల తర్వాత దానిపై లోన్ కావాలన్నప్పుడు, ఆ లోన్ చెల్లించేందుకు ఆరేళ్ల సమయం ఉంటుంది.

ఇబ్బందులు కూడా ఉన్నాయి..

ఎఫ్‌డీల్లో డబ్బు పెట్టడం వల్ల రిస్క్ తక్కువ, స్థిరమైన రాబడి ఉంటుందనేది నిజమే. కానీ ఇందులోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి..

పెనాల్టీ: మొదటగా బ్యాంకు ఎఫ్‌డీల్లో లిక్విడిటీ సమస్య ఎదురవుతుంది. ఎఫ్‌డీలు మెచ్యూరిటీ పూర్తవకుండానే విత్‌డ్రా చేయాలంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. 0.5 శాతం నుంచి 1 శాతం మధ్య ఉండొచ్చు. ఒకవేళ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలో సొమ్ము పెడితే ఐదేళ్లకు ముందే పెనాల్టీ లేకుండా విత్‌డ్రా చేయవచ్చు, కానీ పన్ను ప్రయోజనాలు లభించవు.

రాబడిపై పన్ను: ఎఫ్‌డీ మొత్తంపై వచ్చే పన్ను మొత్తం మీద ప్రభుత్వం పన్ను విధించడం మరొక సమస్య. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఎఫ్‌డీపై లభించే వడ్డీ ఆదాయం కూడా చెప్పాల్సి ఉంటుంది.

తక్కువ రాబడి: ఇతర పెట్టుబడి మార్గాల కంటే ఎఫ్‌డీల్లో ఎక్కువ వడ్డీ లభించదు. ప్రస్తుతం దేశంలో అన్ని బ్యాంకులు 5 శాతం నుంచి 8 శాతం వరకే ఇస్తున్నాయి. కాబట్టి ఎక్కువ రాబడిని ఆశించేవారు ఇతర సాధనాలు ఎంచుకోవడం బెటర్.

బీమా కవరేజ్: ఇతర పెట్టుబడి మార్గాల కంటే ఎఫ్‌డీలు ఎంతో సురక్షితం. అయితే, అనుకోని సందర్భంగా ఎఫ్‌డీ సొమ్ము పెట్టిన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ డిఫాల్ట్ అయితే బీమా కవరేజీ రూ. 5 లక్షలు మాత్రమే వస్తాయి. దానికంటే ఎక్కువ మొత్తం ఎఫ్‌డీల్లో ఉన్నప్పటికీ రూ. 5 లక్షలు మాత్రమే వస్తాయి. కాబట్టి కవరేజీకి మించి ఎఫ్‌డీల్లో పెట్టి, బ్యాంకు ఫిరాయిస్తే నష్టపోవాల్సి రావొచ్చు.

స్థిర వడ్డీ: ఎఫ్‌డీలో సొమ్ము పెట్టిన తర్వాత మెచ్యూరిటీ పూర్తయ్యే మొత్తానికి వడ్డీ ఉంటుంది. దానికంటే ఎక్కువేమీ రాదు. ఎఫ్‌డీలో పెట్టిన తర్వాత వడ్డీ రేట్లు పెరిగినా దాని ప్రయోజనాలు లభించవు. 

 


Similar News

టమాటా @ 100