జూన్ నెలలో రూ.20 లక్షల కోట్లకు పైగా UPI లావాదేవీలు

దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జులై 1న ఒక నివేదికను విడుదల చేసింది

Update: 2024-07-01 12:05 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జులై 1న ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, జూన్ నెలలో UPI లావాదేవీల విలువ రూ. 20.7 లక్షల కోట్లుగా ఉందని వెల్లడైంది. మే నెలలో ఇది రూ. 20.45 లక్షల కోట్లుగా నమోదైంది. జూన్ నెలలో రోజువారీ సగటు లావాదేవీలలో మరింత పెరుగుదల కనిపించినట్లు నివేదిక పేర్కొంది. గత నెలలో ఇది 453 మిలియన్లతో పోలిస్తే జూన్‌లో 463 మిలియన్లకు పెరిగింది. మే నెలలో సగటు లావాదేవీల విలువ రూ. 65,966 కోట్లు కాగా, ఇప్పుడు అది రూ. 66,903 కోట్లకు పెరిగింది.

మరోవైపు మే నెలలో మొత్తం లావాదేవీల సంఖ్య 14.04 మిలియన్లు కాగా, జూన్‌లో అది 13.89 మిలియన్లుగా నమోదైంది. నివేదిక ప్రకారం, ఏడాది కాలంలో డిజిటల్ లావాదేవీల విలువ 36 శాతం, వాటి సంఖ్య 49 శాతం వృద్ధి చెందింది. ఆధార్ ఆధారిత డిజిటల్ లావాదేవీలను ప్రవేశపెట్టడం ద్వారా యూపీఐ లావాదేవీలు భారీగా పుంజుకున్నాయని సంబంధిత వర్గాలు వారు అభిప్రాయ పడుతున్నారు.

2024 ప్రారంభం నుండి యూపీఐ లావాదేవీల వాల్యూమ్‌లు సగటున 50 శాతానికి పైగా వార్షిక వృద్ధిని సాధించాయి. సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లావాదేవీల విలువ 40 శాతం పెరగడం గమనార్హం. ఏప్రిల్ 2016లో యూపీఐ సేవలు ప్రారంభించిన తర్వాత 2024 ఏడాదిలో అత్యధిక సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల పరంగా యూపీఐ ట్రాన్స్‌క్షన్స్ పెరుగుతుంటే IMPS లావాదేవీలలో మాత్రం తగ్గుదల కనిపిస్తుంది.

Similar News