చిన్న పట్టణాల్లో భారీగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు
దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో డిజిటల్ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగిందని ఒక సర్వేలో తేలింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో డిజిటల్ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగిందని ఒక సర్వేలో తేలింది. మొత్తం చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీల వాటా 65 శాతంగా నమోదైందని కెర్నీ ఇండియా, అమెజాన్ పే ఇండియా కలిసి చేసిన ఒక సర్వేలో వెల్లడైంది. అదే పెద్ద నగరాల్లో ఇది 75 శాతంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 25-43 సంవత్సరాల వయస్సు గల వారు డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా చేస్తున్నారు. ఆ తర్వాత కోవలో 44-59 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాత్రం కార్డు లేదా క్యాష్ ద్వారా ఎక్కువగా చెల్లింపులు చేస్తున్నారని నివేదిక పేర్కొంది.
నగదు లావాదేవీలు తగ్గిపోవడంతో UPI, డిజిటల్ వాలెట్లు, కార్డ్‌లు మొదలగునవి విస్తృతమైన ట్రాన్సక్షన్స్‌ను పొందుతున్నాయి. చిన్న దుకాణాల నుంచి మొదలుకుని పెద్ద షాపింగ్ మాల్‌లు, ఇతర వ్యాపార సంస్థల లావాదేవీలు దాదాపు 69 శాతం డిజిటల్ మోడ్‌ల ద్వారానే జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. 120 నగరాలు, 6,000 మంది వినియోగదారులు, 1,000 మంది వ్యాపారులపై జరిపిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అమెజాన్ పే ఇండియా సీఈఓ వికాస్ బన్సాల్ మాట్లాడుతూ, భారతదేశంలో డిజిటల్ విప్లవం మొదలైంది. అన్ని రంగాలు కూడా దీనికి మారిపోయాయి. వీధి వ్యాపారుల్లో, చిన్న పట్టణాలలో కూడా డిజిటల్ లావాదేవీలు చొచ్చుకుపోతున్నాయని అన్నారు.