భారత వృద్ధిని పెంచిన ఐఎంఎఫ్

దేశీయంగా డిమాండ్ పెరగడం, పనిచేసే వయసు ఉన్న జనాభా పెరగడం వంటి అంశాలు దేశ వృద్ధికి దోహదపడతాయని ఐఎంఎఫ్ పేర్కొంది.

Update: 2024-04-16 18:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత వృద్ధి అంచనాలను భారీగా పెంచింది. ప్రస్తుత ఏడాదికి సంబంధించి భారత్ 6.8 శాతంగా వృద్ధి సాధిస్తుందని తెలిపింది. ఇది ఈ ఏడాదిలోనే జనవరిలో అంచనా వేసిన 6.5 శాతం కంటే 30 బేసిస్ పాయింట్లు ఎక్కువ కావడం విశేషం. మంగళవారం ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదిక ప్రకారం, దేశీయంగా డిమాండ్ పెరగడం, పనిచేసే వయసు ఉన్న జనాభా పెరగడం వంటి అంశాలు దేశ వృద్ధికి దోహదపడతాయని ఐఎంఎఫ్ పేర్కొంది. అలాగే, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ నిలుస్తుందని వెల్లడించింది. ఇక, వచ్చే ఏడాదికి భారత వృద్ధిని 6.5 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక, పొరుగునే ఉన్న చైనా వృద్ధిని 2024లో 4.6 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. అదేవిధంగా 2025లో కొంత తగ్గి 4.1 శాతంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా చైనాలో రియల్టీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా వృద్ధి మందగిస్తుందని పేర్కొంది. ఇక, ప్రపంచ వృద్ధికి సంబంధించి 2023లో 3.2 శాతంగానూ, 2024, 2025లోనూ అదే స్థాయిలో స్థిరమైన వృద్ధి నమోదు కావొచ్చని ఐఎంఎఫ్ వెల్లడించింది.  

Tags:    

Similar News